కారుకి కట్టేసి కుక్కని ఈడ్చుకెళ్లిన ఘటన గుర్తుందా.. ఇప్పుడు ముగ్గురు పిల్లల తల్లి అయ్యింది

కారుకి కట్టేసి కుక్కని ఈడ్చుకెళ్లిన ఘటన గుర్తుందా.. ఇప్పుడు ముగ్గురు పిల్లల తల్లి అయ్యింది

Remember Dog Who Dragged Behind A Car: ఓ వ్యక్తి.. కుక్కని కారుకి కట్టేసి ఈడ్చుకెళ్లిన ఘటన గుర్తింది కదూ. మూగజీవి అని కూడా చూడకుండా ఎంతో అమానుషంగా ప్రవర్తించాడా వ్యక్తి. కొన్ని నెలల క్రితం కేరళలో చోటు చేసుకున్న ఈ దారుణం మానవత్వానికే మాయని మచ్చలా నిలిచింది. అందరి హృదయాలను ద్రవింపజేసింది. ఈ ఘటనలో తీవ్రంగా బాధించబడ్డ కుక్క గుర్తుంది కదూ. ఇప్పుడా శునకం గురించి ఓ గుడ్ న్యూస్ తెలిసింది. ఆ మూగజీవి తల్లి అయ్యింది. మూడు బుజ్జి పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కుక్కని చేరదీసి సంరక్షిస్తున్న దయా యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ స్వయంగా తెలిపింది.

Kerala Dog Car

మూడు పిల్లలకు జన్మనిచ్చిన కుక్క:
”అబ్బక్క(కుక్క పేరు) ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. తల్లి అయ్యింది. మూడు బుజ్జి బుజ్జి, అందమైన కూనలకు జన్మనిచ్చింది” అని దయా యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. మూడు పిల్లలు, తల్లి ఆరోగ్యంగా ఉన్నాయని వారు తెలిపారు. అబ్బక్క తల్లి కావడం మాకు కూడా చాలా ఆనందంగా ఉందన్నారు.

Kerala Dog Car

”కుక్కని మేము చేరదీసినప్పుడు రొటీన్ టెస్టులు, స్కాన్ లు చేశాము. కానీ ఏమీ తెలియరాలేదు. డాక్టర్ దాన్ని పరీక్షించినప్పుడు కూడా అది ప్రెగ్నెంట్ అనే విషయం తెలియలేదు. అయితే అబ్బక్క ఎక్కువ ఆహారం తినేది. అప్పుడు మాకు సందేహం వచ్చింది. ఆ తర్వాత మరోసారి స్కాన్ చేశాము. అప్పుడు తెలిసింది అది 58రోజుల ప్రెగ్నెంట్” అని దయా ప్రతినిధి తెలిపాడు.

మూగజీవి పట్ల క్రూరంగా ప్రవర్తించిన యజమాని:
కొన్ని నెలల క్రితం అంటే గతేడాది(2020) డిసెంబర్ లో.. కేరళ ఎర్నాకులానికి చెందని యూసఫ్ అనే వ్యక్తి తన పెంపుడు కుక్క పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. పెంపుడు కుక్క ప్రవర్తనతో విసుగు చెందిన అతడు.. దాన్ని దూరంగా తీసుకెళ్లి వదిలేయాలని భావించాడు. ఆ తర్వాత కుక్క మెడకు తాడుకట్టి, దానిని కారుకు అనుసంధానం చేశాడు. ఆ తర్వాత కుక్కని రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. చాలా కిరాతకంగా వ్యవహరించాడు. దీన్ని రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. అంతే, కుక్కను కారుకు కట్టి ఈడ్చుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయ్యో పాపం అని అంతా జాలి చూపారు. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగడం, ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగాయి.

Kerala Dog Car

కాగా, కారుకి కట్టి ఈడ్చుకెళ్లిన ఘటనలో కుక్కకి తీవ్ర గాయాలు అయ్యాయి. అది ఎంతో వేదన అనుభవించింది. వీడియో వైరల్ కావడంతో విషయం తెలుసుకున్న దయా యానిమల్ వెల్ఫేర్ ప్రతినిధులు కుక్కని గుర్తించి దాన్ని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడ దానికి చికిత్స అందించారు. ప్రస్తుతం అబ్బక్క బాగోగులను వారే చూసుకుంటున్నారు. ఇప్పుడా శునకం సంపూర్ణ ఆరోగ్యంతో చాలా ఆనందంగా ఉంది.

Kerala Dog Car