Assam-Mizoram Border : అసోం-మిజోరాం బోర్డర్ లో ఉద్రిక్త పరిస్థితులు..ట్విట్టర్ లో సీఎంల ఫైట్

వివాదాస్పద అసోం-మిజోరాం బోర్డర్ లో ఇవాళ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.

10TV Telugu News

Assam-Mizoram Border వివాదాస్పద అసోం-మిజోరాం బోర్డర్ లో ఇవాళ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అసోంలోని కాచర్ జిల్లా మరియు మిజోరాంలోని కొలాసిబ్ జిల్లా సరిహద్దు పంచుకున్న ప్రాంతంలో ఇవాళ కాల్పులు కలకలం రేపాయి. ఇరువైపులా ప్రజలు రాళ్లు రువ్వుకున్నారు. ప్రభుత్వాధికారులపై కూడా రాళ్లు విసిరారు. ప్రభుత్వ వాహనాలను కూడా తగులబెట్టారు. దీంతో పరిస్థితిని అదుపుచేసేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. అయితే మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా సమావేశమైన రెండు రోజుల తర్వాతే ఈ హింసాత్మ ఘటనలు చోటుచేసుకోవడం చర్చనీయాంశమవుతోంది.

మరోవైపు, అసోం-మిజోరాం రాష్ట్రాల ముఖ్యమంత్రులు ట్విట్టర్‌ వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అంతేకాకుండా ఇద్దరు సీఎంలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరుని తమ ట్విట్టర్ పోస్టుల్లో ట్యాగ్ చేశారు.

మిజోరాం సీఎం జొరామ్‌తంగా..బోర్డర్ లో ప్రజలు కర్రలు చేత పట్టుకొని హింసకు దిగుతున్నట్లు కనిపిస్తోన్న వీడియోను ట్వీట్టర్ లో షేర్ చేస్తూ..ఈ విషయంలో అమిత్ షా జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ గొడవలు ఇప్పుడే ఆగిపోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పీఎంవో ఇండియా,అసోం సీఎం హిమంతబిశ్వశర్మ,కేంద్ర హోంమంత్రి పేర్లను ట్యాగ్ చేస్తూ… కాచార్ మీదుగా మిజోరాంకు కారులో తిరిగి వెళుతున్న అమాయక దంపతులపై దుండగులు దాడికి పాల్పడ్డారని, వారి దగ్గర ఉన్న వస్తువులు,నగదుని దోచుకుని వారి కారుని ధ్వంసం చేశారని..ఈ హింసాత్మక చర్యలను మీరు ఎలా సమర్థించబోతున్నారు అని మరొక ట్వీట్ లో మిజోరాం సీఎం పేర్కొన్నారు.

అసోం సీఎం హిమంతబిశ్వ శర్మ ఓ ట్వీట్ లో..పౌరులు తమ మాట వినడం లేదని.. హింసాత్మక ఘటనలు ఆపేవరకు మీ పోస్ట్ నుంచి పోలీసులను ఉపసంహరించుకోండి అంటూ కోలాసిబ్(మిజోరాం)ఎస్పీ తమను అడుగుతున్నారని ఇటువంటి పరిస్థితుల్లో మేం ప్రభుత్వాన్ని ఎలా నిర్వహించగలము అని మిజోరాం సీఎంని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. వీలైనంత తర్వగా ఈ విషయంలో మిజోరాం సీఎం జోక్యం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు ట్వీట్ లో పేర్కొన్నారు.

శర్మ ట్వీట్ పై స్పందించిన మిజోరాం సీఎం… అమిత్ షాతో ఈశాన్య రాష్ట్రాల సీఎంల సమావేశం తర్వాత ఆశ్చర్యకరంగా అసోం పోలీసు యొక్క 2 కంపెనీలు పౌరులతో కలిసి..ఇవాళ మిజోరాంలోని వైరెంగ్టే ఆటో రిక్షా స్టాంగ్ వద్ద పౌరులపై లాఠిచార్జ్ చేయడమే కాకుండా టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారని ట్వీట్ చేశారు. వారు CRPF సిబ్బంది, మిజోరాం పోలీసులను కూడా పక్కకు నెట్టేశారని ట్వీట్ లో పేర్కొన్నారు.

అయితే ఆ తర్వాత మిజోరాం సీఎంతో మాట్లాడిన శర్మ…రెండు రాష్ట్రాల సరిహద్దుల మధ్య యథాతథ స్థితిని, శాంతిని అసోం కొనసాగిస్తుందని పునరుద్ఘాటించారు. ఐజ్వాల్‌ను సందర్శించి, అవసరమైతే ఈ సమస్యలపై చర్చించడానికి తాను సిద్ధమేనని శర్మ ట్వీట్ చేశారు. పౌరుల భద్రత నేపథ్యంలో వైరెంగ్టే నుంచి వైదొలగాలని అస్సాం పోలీసులను ఆదేశించాలని మిజోరం సిఎం..శర్మని కోరారు.

వివాదమేంటీ?

మూడు మిజోరాం జిల్లాలు – ఐజ్వాల్, కోలాసిబ్ మరియు మామిట్.. అసోంలోని కాచర్, హైలాకాండి మరియు కరీమ్‌గంజ్ జిల్లాలతో 164.6 కిలోమీటర్ల పొడవైన అంతర్-రాష్ట్ర సరిహద్దును పంచుకుంటాయి. సరిహద్దులోని “వివాదాస్పద” ప్రాంతాలలో కొన్నేళ్లుగా వాగ్వివాదం జరుగుతోంది. ఇరు వైపుల ప్రజలు తమ భూములు ఆక్రమించుకుంటారన్నంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. గత నెలలో అసోం పోలీసులు..పొరుగు రాష్ట్రం తన భూభాగాన్ని ఆక్రమించిందని ఆరోపిస్తూ మిజోరాంలోని సమీప సరిహద్దు గ్రామమైన వైరంగ్టే నుండి 5 కిలోమీటర్ల దూరంలోని ఐట్లాంగ్ ని స్వాధీనం చేసుకున్నారని,దీంతో అప్పుడు పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు మిజోరాం పోలీసు అధికారులు తెలిపారు.

సరిహద్దు లైన్ ని గుర్తించడానికి మిజోరాం ప్రభుత్వం.. బౌండరీ కమిషన్ ని ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌కు ఉప ముఖ్యమంత్రి టాన్లూయా అధ్యక్షత వహిస్తారు మరియు హోంమంత్రి లాల్‌చామ్లియానాను ఉపాధ్యక్షులుగా ఉంటారు. కాగా,అసోంకి.. మేఘాలయ,అరుణాచల్ ప్రదేశ్ తో కూడా సరిహద్దు వివాదాలున్నాయి.

10TV Telugu News