TRP స్కామ్ : రిపబ్లిక్ టీవీ సీఈవో అరెస్ట్

  • Published By: venkaiahnaidu ,Published On : December 13, 2020 / 08:32 PM IST
TRP స్కామ్ : రిపబ్లిక్ టీవీ సీఈవో అరెస్ట్

Republic TV CEO Arrested రిపబ్లిక్ టీవీ సీఈవో వికాస్ ఖంచందానీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ (TRP) స్కామ్‌ ‌లో హస్తం ఉందనే ఆరోపణలపై వికాస్‌ ‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, మహారాష్ట్ర పోలీసుల నుంచి తమ ఉద్యోగులకు,తమ గ్రూప్ కి రక్షణ కొరుతూ రిపబ్లిక్ మీడియా నెట్ వర్క్ కి చెందిన AGR మీడియా ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించిన వారం రోజుల లోపే రిపబ్లిక్ టీవీ టాప్ ఎగ్జిక్యూటివ్ వికాస్ ఖంచందానీ అరెస్ట్ జరిగింది.

మరోవైపు రిపబ్లిక్‌ టీవీ (Republic TV) డిస్ట్రిబ్యూషన్‌ అధినేత ఘన్‌శ్యామ్‌ సింగ్‌ను మహారాష్ట్ర పోలీసులు నవంబర్‌లో అరెస్ట్ చేశారు. అయితే అనంతరం ఆయన బెయిల్ పిటిషన్‌కు ఆమోదం రావడం తెలిసిందే. కాగా,ఈ కేసులో ఇప్పటివరకు 13మంది అరెస్ట్ అయ్యారు.

రిపబ్లిక్ సహా కొన్ని టీవీ చానళ్లు టీఆర్పీ నంబర్‌‌ల విషయంలో రిగ్గింగ్‌‌కు పాల్పడుతున్నాయంటూ అక్టోబర్ నెలలో హన్సా రీసెర్చి గ్రూప్‌ కంప్లెయింట్ తో టీఆర్పీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. బ్రాడ్‌కాస్ట్‌ ఆడియెన్స్‌ రీసెర్చి కౌన్సిల్‌(BARC) కోసం హన్సా గ్రూప్ సేవలు అందిస్తుంది. హన్సా గ్రూప్ ఫిర్యాదు మేరకు అక్టోబర్‌ నెలలోనే రిపబ్లిక్‌ టీవీపై పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు దర్యాప్తు జరిగింది. కొందరు టీవీ ప్రేక్షకులకు డబ్బుల రూపంలో లంచం ఇచ్చి, టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి రిపబ్లిక్ టీవీ యత్నించిందని పోలీసుల ఇన్వెస్టిగేషన్‌‌లో వెలుగుజూసింది.

రిపబ్లిక్‌ టీవీతో పాటు మరో రెండు టీవీ ఛానళ్లు మోసాలకు పాల్పడుతున్నాయని ముంబై సీపీ పరం వీర్‌సింగ్ సైతం స్వయంగా ప్రకటించారు. మరోవైపు రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్నాబ్‌ గోస్వామి సైతం ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మోసానికి పాల్పడ్డారని, దీంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు కారణమయ్యారనే కేసులో అరెస్ట్ కావడం తెలిసిందే. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వంగానే రిపబ్లిక్ టీవీని టార్గెట్ చేసుకుందని దాని యాజమాన్యం ఆరోపిస్తోంది.

టీఆర్పీ స్కామ్ వెలుగులోకి రావడంతో న్యూస్ ఛానల్స్ యొక్క వీక్లీ రేటింగ్స్ విధానాన్ని 12వారాల పాటు నిలిపివేస్తున్నట్లు అక్టోబర్-15,న బార్క్​(Broadcast Audience Research Council)ప్రకటించిన విషయం తెలిసిందే. రేటింగ్​ గణాంకాలను మెరుగుపరచడానికి ప్రస్తుత ప్రమాణాలను సమీక్షించి, వాటిలో మార్పులు చేర్పులు చేయాలని బార్క్​ ఈ నిర్ణయం తీసుకుంది.