Delhi Air Pollution: ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టండి.. రైతులతో మాట్లాడండి.. సుప్రీంకోర్టు సీరియస్!

దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేస్తుంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న పొల్యూషన్ స్థాయి రాజధాని పౌరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.

Delhi Air Pollution: ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టండి.. రైతులతో మాట్లాడండి.. సుప్రీంకోర్టు సీరియస్!

Delhi

Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేస్తుంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న పొల్యూషన్ స్థాయి రాజధాని పౌరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అటు సుప్రీం కూడా సీరియస్‌ కావడంతో.. హస్తిన ప్రభుత్వం అలర్ట్ అయింది.

ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించడానికి, కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ రోజు సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ రూపంలో అందజేసింది.

ఢిల్లీ ప్రభుత్వం పూర్తి లాక్‌డౌన్ విధించడానికి సిద్ధంగా ఉందని వెల్లడించింది. అయితే, పొరుగు రాష్ట్రాల పరిధిలోకి వచ్చే ఎన్‌సిఆర్‌లో కూడా లాక్‌డౌన్ విధిస్తేనే పరిస్థితి అదుపులోకి వస్తుందని ప్రభుత్వం అభిప్రాయపడింది.

కొన్ని పరిశ్రమలు, వాహనాలు, ప్లాంట్ల నిర్వహణను కొంతకాలం పాటు నిలిపివేయవచ్చా? లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రం, రాష్ట్రాలకు కోర్టు సూచించింది.

ఈ అంశంపై వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరింది సుప్రీంకోర్టు. ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. ఇటుక బట్టీలను మూసెయ్యాలని, రోడ్డు నిర్మాణ హాట్ మిక్స్ ప్లాంట్లు మూసివేయడం వంటి చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది.

అంతేకాదు.. ఎన్‌సీఆర్ ప్రాంతంలో రైతులు తగలబెట్టే ప్రక్రియలను వారం రోజుల పాటు ఆపేలా చర్యలు తీసుకోవాలని, రైతులతో మాట్లాడాలని, ఈమేరకు హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాలను కోరాలని కోర్టు సూచించింది. ఢిల్లీ కన్నట్‌ ప్లేస్‌లో స్మోగ్‌ టవర్‌ మాత్రం మంచి ఫలితాలనిస్తోంది.

బయటి వాయు కాలుష్యంతో పోలిస్తే.. స్మోగ్‌ టవర్‌ ప్రాంతంలో గాలి నాణ్యత మెరుగుపడింది. ఒక కిలోమీటర్ వ్యాసార్థం పరిధిలో 50నుంచి 70శాతం వరకు వాయు కాలుష్యం తగ్గింది. రోజుకు 20గంటలు పనిచేస్తోంది ఈ స్మోగ్‌ టవర్‌. ఒక కిలోమీటర్ వరకు ఇది ప్రభావం చూపిస్తుందన్నారు అధికారులు.