రూ. 20 వాటర్ బాటిల్ కు రూ. 164 బిల్లు, ఐదేళ్లు పోరాటం చేసి గెలిచిన కస్టమర్

రూ. 20 వాటర్ బాటిల్ కు రూ. 164 బిల్లు, ఐదేళ్లు పోరాటం చేసి గెలిచిన కస్టమర్

Restaurant Overcharged : రూ. 20 విలువ చేసే వాటర్ బాటిల్ కు ఏకంగా…రూ. 164 బిల్లు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..రెస్టారెంట్ పై కేసు వేశారు ఓ కస్టమర్. సుదీర్ఘకాలం పాటు పోరాడి విజయం సాధించారు. ఎమ్మార్పీ రేటు ప్రకారం కాకుండా..అధికంగా వాటర్ బిల్లు అమ్మారంటూ..వేసిన ఈ కేసు ఐదేళ్ల పాటు కొనసాగింది. ఈ ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది. అహ్మదాబాద్ కు చెందిన రోహిత్ పాటిల్ (67) 2015, అక్టోబర్ ఎస్ జీ హైవేలోని ఓ హోటల్ కు వెళ్లారు. స్నేహితులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఓ వాటర్ బాటిల్ తీసుకున్నారు. రూ. 20 విలువ చేసే ఆ వాటర్ బాటిల్ కు రూ. 164గా వేయడంతో షాక్ తిన్నారు. ఇదే విషయాన్ని సిబ్బందిని ప్రశ్నించారు. తమ రెస్టారెంట్ లో వాటర్ బాటిల్ అంతే ధరకు విక్రయిస్తామని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిల్లు మొత్తాన్ని కట్టించే దాక వదలలేదు. 2015 నవంబర్ నెలలో వినియోగదారుల ఫోరంలో రోహిత్ ఫిర్యాదు చేశారు. బిల్లు, హోటల్ నుంచి తెచ్చుకున్న వాటర్ బాటిల్ ఆధారాలను చూపెట్టారు. లక్ష రూపాయల పరిహారం చెల్లించాలని రోహిత్ డిమాండ్ చేశారు. రెస్టారెంట్ వారికి నోటీసులు వెళ్లడంతో వారు న్యాయవాదిని నియమించుకుని వాదించారు. అప్పటి నుంచి విచారణ కొనసాగింది. వాటర్ బాటిల్ కు రూ. 164 బిల్లు వేయడం సరైందేనని, తమ రెస్టారెంట్ లో ఉన్న సర్వీసు ప్రకారం ఉందని వాదించారు. ఇలా ఇరుపక్షాల వాదన కోర్టు వింది. చివరకు తుది తీర్పును వెలువరించింది.

వాటర్ బాటిల్ కు అంత ధర వసూలు చేయడం అన్యాయమని, ఎమ్మార్పీ ధర కంటే..భారీ మొత్తంలో వసూలు చేశారని వ్యాఖ్యానించింది. హోటల్ సిబ్బంది వేధింపులకు గురి చేసినందుకు గాను..రోహిత్ కు రూ. 2 వేల 500, ఇతర ఖర్చులకు మరో రూ. 3 వేలు చెల్లించాలని రెస్టారెంట్ యాజమాన్యాన్ని ఆదేశించింది. నెలలోపు రూ. 5 వేల 500 అందించాలని సూచించింది. దీనిపై రోహిత్ సంతోషం వ్యక్తం చేశారు. తనకు వచ్చిన డబ్బులను ఏదైనా స్వచ్చంద సంస్థకు విరాళంగా ఇస్తానని వెల్లడించారాయన.