Dubai Pfizer Vaccine : వ్యాక్సిన్ కోసం దుబాయ్ విహార యాత్ర

Dubai Pfizer Vaccine : వ్యాక్సిన్ కోసం దుబాయ్ విహార యాత్ర

Dubai Pfizer Vaccine

Rich Indians going to Dubai : సంపన్నులంతా చలో దుబాయ్ అంటున్నారు. వ్యాక్సిన్ వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ అతలాకుతలం చేస్తోంటే..వారంతా విహార యాత్రలు ఎందుకు చేస్తున్నారు…? ఇంటికి పరిమితమై కరోనా నుంచి రక్షణ పొందమని వైద్యులు సలహా ఇస్తోంటే…దేశం దాటి ప్రయాణాలు ఎలా చేస్తున్నారు..? దీనికి సమాధనమే…డెస్టినేషన్ ఫైజర్.

అవును అంతర్జాతీయంగా విమానయానంపై ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ..భారత్-దుబాయ్ చార్ట్‌డ్ ఫైట్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయంటే…దానికి కారణం ఫైజర్ వ్యాక్సిన్. దేశంలో వ్యాక్సిన్ కొరత అధికంగా ఉండడంతో…దుబాయ్ వీసా ఉన్న సంపన్నులు.. కుటుంబంతో కలిసి అక్కడికి వెళ్లి టీకా వేయించుకుంటున్నారు.

మార్చి నుంచి భారత్, దుబాయ్ ఫైట్లు కిటకిటలాడుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతుండడం, కేసులు ఊహించని రీతిలో పెరుగుతుండడంతో టీకా వేయించుకునేందుకు దుబాయ్ వెళ్తున్నారు కొందరు వ్యాపారవేత్తలు, ఉద్యోగులు. దుబాయ్‌లో 40 ఏళ్లు పైబడిన వారందరికీ ఫైజర్ వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తున్నారు.

గత నెలలో దుబాయ్ రెసిడెంట్ వీసా ఉన్నవారికి సైతం వ్యాక్సిన్ అందించేందుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతిచ్చింది. దుబాయ్‌లో పర్యటించేందుకు, టీకా వేయించుకునేందుకు వీలు కలగడంతో….సంపన్నులంతా అక్కడకు క్యూ కట్టారు. వెకేషన్ ఎంజాయ్ చేస్తూనే వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు.

ఫైజర్ టీకా రెండు డోసుల మధ్య మూడు వారాల వ్యవధి ఉండాలి. మొదటి డోస్ తీసుకున్న మూడు వారాల తర్వాత రెండో డోస్ తీసుకోవాలి. టీకా తీసుకునేందుకు వెళ్లిన భారతీయుల్లో కొందరు తొలి డోస్ తీసుకుని అక్కడే హోటల్‌లో ఉంటున్నారు. మూడు వారాల పాటు దుబాయ్ అంతా చుట్టివచ్చి…రెండో డోస్ కూడా తీసుకుని స్వదేశానికి తిరుగు ప్రయాణమవుతున్నారు.

మరికొందరు మాత్రం మొదటి డోస్ తీసుకున్న వెంటనే భారత్ వచ్చేసి..మూడు వారాల తర్వాత మరోసారి దుబాయ్ వెళ్లి రెండో డోస్ వేయించుకుంటున్నారు. మరి వ్యాక్సిన్ ఉచితంగా వేసినప్పటికీ….దుబాయ్ వెళ్లి రావడానికి ఖర్చు ఎంతవుతుందో తెలుసా..? ఒక్కొక్కరికీ 35లక్షల నుంచి 55 లక్షల వరకు ఖర్చవుతోంది. అయితే డెస్టినేషన్ ఫైజర్ ప్రయాణం చేస్తున్న వాళ్లంతా సంపన్నులే కాబట్టి..వారికి ఈ ఖర్చు పెద్ద విషయం కాదు.

ఉన్నత ఉద్యోగులు, దుబాయ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారు, ఆ దేశంలో వ్యాపారాలు చేస్తున్న పారిశ్రామిక వేత్తలు లక్షలు ఖర్చుపెట్టి మరీ ఇలా ఫ్రీ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఫైజర్ సురక్షితమైనదిగా భావించడంతో పాటు..వినోదమూ, వ్యాక్సిన్ రెండూ కలిసొస్తాయన్నది వారి ఆలోచన.