Kuwait Heat: సుసంపన్న దేశం “కువైట్”లో భానుడి భగభగలు, వలస కూలీల పరిస్థితి దారుణం

కువైట్ లో మనుషులు నివసించలేనంతగా ఎండలు పెరిగిపోతాయని, దేశం మొత్తం ఉష్ణ ఎడారిగా మారిపోయి "నివాసయోగ్యం కాని ప్రాంతం"గా అవతరిస్తుందని అంతర్జాతీయ పర్యావరణవేత్తలు అంచనా వేస్తున్నారు.

Kuwait Heat: సుసంపన్న దేశం “కువైట్”లో భానుడి భగభగలు, వలస కూలీల పరిస్థితి దారుణం

Kuwait

Kuwait Heat: ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగిన దేశం. కార్ల తయారీ సంస్థలకు స్వర్గధామం. నిర్మాణ, మౌలికరంగ సంస్థలకు పెట్టింది పేరు. ప్రపంచ దేశాలు వాడే ఇందనం, బంగారం.. అగ్రభాగం ఈ దేశం నుంచే సరఫరా అవుతుంది. ఇవీ ఇప్పటివరకు అరబ్ దేశం “కువైట్” గురించి మనకు తెలిసిన విషయాలు. అటువంటి ఈ దేశం ఇప్పుడు భరించలేని వేడితో అల్లాడిపోతోంది. భానుడి ప్రతాపానికి “కువైట్ దేశం” భగభగలాడుతుంది. ఎండా కాలం వచ్చిందంటే చాలు ఆ దేశ ప్రజలు వొణికిపోతున్నారు. ఎండ వేడిమికి క్షణం పాటు బయటకు కూడా అడుగుపెట్టలేని పరిస్థితి కువైట్ లో నెలకొంది.

ప్రస్తుత పరిస్థితులు:

“కువైట్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం” అనే నానుడి నుండి “ప్రపంచంలోనే అత్యంత వేడి ప్రాంతం కువైట్” అనేలా మారిపోయింది అక్కడి పరిస్థితి. 2016 జులై 21న కువైట్ లోని మిత్రిబాహ్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 54 డిగ్రీలకు చేరుకుంది. కువైట్ చరిత్రలోనే నమోదైన అత్యంత గరిష్ట ఉష్ణోగ్రత అది. 2016 నుంచి కువైట్ లో 50 డిగ్రీల ఉష్ణోగ్రత సర్వసాధారణం అయిందంటే అక్కడి పరిస్థితి తీవ్రతకు అర్ధం పడుతుంది. సీజన్లో ఎండ వేడిమిని తట్టుకోలేక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ముఖ్యంగా జులై చివరి వారంలో ఉష్ణోగ్రతలు అత్యంత తీవ్రంగా ఉంటున్నాయి. వేడి తట్టుకోలేక పక్షులు చచ్చిపోతున్నాయి, కుక్కలు, పిల్లులు ఊపిరి సంబంధిత వ్యాధులతో కొట్టుమిట్టాడుతున్నాయి. దేశంలో ఉన్న వన్యప్రాణులు ఎడారి అటవీ ప్రాంతాలను వదిలి నీడ కోసం గ్రామాలూ, పట్టణాల్లోకి వస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో కువైట్ లో జంతువులు మాయమవడం ఖాయమని స్థానిక వన్యప్రాణి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: India Corona: ఒక్కరోజులో దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కొత్త కేసులు

ఎండలకు మృతి చెందుతున్న వలస కూలీలు:

సుసంపన్న దేశమైన కువైట్ లో ప్రజల వద్ద డబ్బుకు కొదవలేదు. దీంతో ఎండాకాలం సమయంలో కొందరు సంపన్నులు శక్తివంతమైన ఏసీ యంత్రాలు కొనుగోలు చేసుకుంటుండగా, మరికొందరు యూరప్ దేశాలకు తరలి వెళ్లిపోతున్నారు. ఇంట్లో ఉంటే ఏసీలు, బయటకు వస్తే ఏసీ కారు లేకుండా ప్రజలు బయటకు రావడం లేదు. షాపింగ్ మాల్స్, ఎయిర్ పోర్ట్, బస్సు స్టాండ్ వంటి పబ్లిక్ ప్రాంతాల్లోనూ ఏసీలు పనిచేయాల్సిందే. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది.. వలస కార్మికుల గురించి. ప్రపంచంలో పనికోసం అత్యధిక మంది తరలివెళ్తున్న దేశం కువైట్. దేశ జనాభాకు సరిసమానంగా కువైట్ లో వలస కార్మికులు నివసిస్తున్నారు. అందులోనూ భారత్, బాంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాల నుంచి వచ్చిన లక్షలాది మంది వలస కార్మికులు కువైట్ లో పనిచేస్తున్నారు. చాలీచాలని జీతాలతో, చిన్నగదుల్లో ఉంటూ అక్కడ కూలీ పనులు చేసుకుంటున్నారు. ఎండాకాలం సమయంలో వీరి పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. ఇరుకు గదుల్లో ఉండే వీరికి అక్కడి ప్రభుత్వాలు, యాజమాన్యాలు కనీస సౌకర్యలు కూడా కల్పించడం లేదు. దీంతో ఎండాకాలం వచ్చిందంటే కూలీలు శ్వాస సంబంధిత వ్యాధులతో అల్లాడిపోతున్నారు. కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పనివేళల్లో కొంత కోత విధించిన అక్కడి ప్రభుత్వం.. ఆమేరకు వారి జీతాల్లోనూ కోత పెట్టింది. చాలీచాలని జీతాలతో బ్రతుకు నెట్టుకొస్తున్న వలస కూలీలు అక్కడ ఏసీలు, కార్లు వంటి సౌకర్యాలకు ఆమడ దూరంలో ఉంటున్నారు. వడగాలుల ధాటికి మరణిస్తున్న వారి సంఖ్య గడిచిన రెండేళ్లలో రెట్టింపవగా, మృతుల్లో అత్యధిక భాగం వలస కార్మికులేఉన్నారంటే అక్కడి దారుణ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవాలి.

Also read: Indian Navy: ఐఎన్ఎస్ రణవీర్ యుద్ధనౌకలో పేలుడు, ముగ్గురు మృతి 11 మందికి గాయాలు

రాజకీయాలు ముడిపడి ఉన్నాయి: 

కువైట్ లో వేడి తీవ్రత పెరగడానికి కేవలం గ్లోబల్ వార్మింగ్, ఎడారి గాలులే కాదు, దేశంలోని అంతర్గత వ్యవహారాలు కారణంగా నిలుస్తున్నాయి. 45 లక్షల జనాభా కూడా లేని కువైట్ దేశంలో.. మనుషుల కంటే కార్లు అధికంగా ఉన్నాయి. దేశంలో ఒక్కో ప్రాంతానికి మధ్య దూరం ఎక్కువగా ఉండడంతో కువైట్ దేశస్థులు విచ్చలవిడిగా కారు వినియోగిస్తున్నారు. ఇదే ఇక్కడ ప్రధాన సమస్యగా చెప్పవచ్చు. ప్రజల పై నియంత్రణే లేని నేతలకు ఇక గ్లోబల్ వార్మింగ్ కట్టడి అతిపెద్ద సవాలుగా మారింది. మధ్యప్రాచ్యంలో మిగిలిన దేశాలతో పోలిస్తే, వాతావరణ నియంత్రణలో కువైట్ వెనుకబడి ఉంది.

నవంబర్‌లో జరిగిన COP26 శిఖరాగ్ర సమావేశంలో 2035 నాటికి గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను 7.4% తగ్గించాలని కువైట్ ప్రతిజ్ఞ చేసింది. ఇది 2030 నాటికి గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలంటూ పారిస్ ఒప్పందం యొక్క లక్ష్యానికి ఇది 45% తక్కువ. కువైట్ ఇరుగుపొరుగు దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈలు 2060 నాటికీ “నెట్ జీరో కర్బన ఉద్గారాల” దిశగా అడుగులువేస్తుంటే, కువైట్ మాత్రం ఆదిశగా ఇంతవరకు ప్రణాళిక కూడా సిద్ధం చేయలేదు. సౌదీ, యూఏఈ దేశాలు కర్బన ఉద్గారాలను తగ్గించి, పునరుత్పాదక మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెడుతుంటే..కువైట్ మాత్రం తమ వద్దనున్న $700 బిలియన్ డాల్లర్ల సావేరిన్ ఫండ్ ని అధిక లాభాలు ఇచ్చే ఇతర పెట్టుబడుల వైపు మళ్ళిస్తుంది.

Also read: Work from Home: ఆఫీసు కుర్చీని ఇంటికి తీసుకెళ్లడం ఉద్యోగం తొలగించేంత నేరం కాదు

మున్ముందు మరింత దారుణ పరిస్థితులు:

ఇక పరిస్థితి ఇలాగే కొనసాగితే 2070-2100 సంవత్సరానికే కువైట్ లో మనుషులు నివసించలేనంతగా ఎండలు పెరిగిపోతాయని, దేశం మొత్తం ఉష్ణ ఎడారిగా మారిపోయి “నివాసయోగ్యం కాని ప్రాంతం”గా అవతరిస్తుందని అంతర్జాతీయ పర్యావరణవేత్తలు అంచనా వేస్తున్నారు. వాతావరణ మార్పులపై కువైట్ నేతలకు కనువిప్పు కలిగేలా కొన్న్ని స్వచ్చంద సంస్థలు, వ్యక్తులు చేస్తున్న ప్రయత్నాలు అక్కడి ప్రభుత్వంలో కాస్త చలనం తీసుకొచ్చాయి. దీంతో ఇప్పటి వరకు గరిష్టంగా 1%గా ఉన్న, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని 2030 నాటికి 15%గా చేయాలనే ప్రణాళికతో కువైట్ ముందుకు పోతుంది. అంతా అనుకున్నట్టుగా జరిగితే భవిష్యత్ తరాలకు కువైట్ ను ఒక దేశంగానే పరిచయం చేయవచ్చని, లేకపోతే చరిత్ర పఠంలో అంతరించిన ప్రదేశంగా చూపించాల్సి వస్తుందని కువైట్ దేశస్థులు అంటున్నారు.