కూతురికి బాధ్యతలు…HCL చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న శివ్ నాడార్

  • Published By: venkaiahnaidu ,Published On : July 17, 2020 / 03:22 PM IST
కూతురికి బాధ్యతలు…HCL చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న శివ్ నాడార్

HCLటెక్నాలజీస్ ఫౌండర్ శివ్ నాడార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ హెచ్‌సీఎల్ టెక్ కంపెనీ చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు శివ్ నాడార్ ప్రకటించారు. శివనాడర్ స్థానాన్ని ఆయన కుమార్తె రోషిణి నాడార్ మల్హోత్రా(38) భర్తీ చేయనున్నారు. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని.. కంపెనీ ఛైర్ పర్సన్‌గా రోషిణి శుక్రవారం నుంచే బాధ్యతలు చేపడతారని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, శివ్ నాడార్ ఇకపై కంపెనీలో చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌ హోదాతో పాటు ఎండీ పదవిలో కొనసాగుతారు అని కంపెనీ తెలిపింది. .

శివ నాడార్‌కు…రోషిణి(38) ఏకైక సంతానం. HCL టెక్నాలజీస్‌లో ఇప్పటికే ఆమె ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవిలో ఉన్నారు. 2019లో ఫోర్బ్స్ ప్రపంచంలోని 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో రోషిణి 54వ స్థానంలో నిలిచారు. ప్రపంచం కుబేర మహిళల్లో ఈమె కూడా ఒకరు. 2019 IIFL వెల్త్ ర్యాంకింగ్స్ ప్రకారం రోషిణికి 36,800 కోట్ల ఆస్తులు ఉన్నాయి.

HCL స్థాపన, రూ.1.7 లక్షల కోట్ల స్థాయి

తమిళనాడు రాష్ట్రంలో 1945 జూలై 14న శివ్ నాడర్ జన్మించారు. ఈయన పూణేలోని వాల్‌చంద్ గ్రూప్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో కెరీర్ ప్రారంభించారు. బిజినెస్ నిర్వహణలో కొంత అనుభవం పొందిన తర్వాత కంపెనీ నుంచి బయటకు వచ్చారు. సొంతంగానే బిజినెస్ ప్రారంభించారు. స్నేహితులతో కలిసి మైక్రోక్యాంప్ పేరుతో ఒక కంపెనీని ప్రారంభించారు. టెలీడిజిటల్ క్యాలిక్యులేటర్లను విక్రయించారు.

అనతికాలంలోనే ఆ కంపెనీ హిందుస్తాన్ కంప్యూటర్స్‌ లిమిటెడ్ (హెచ్‌సీఎల్)గా ఆవిర్భవించింది. కంప్యూటర్లు తయారు చేయడం ప్రారంభించింది. హెచ్‌సీఎల్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా పేరొందిన బ్రాండ్‌గా అవతరించింది. 1980లో ఇంటర్నేషనల్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫార్ ఈస్ట్ కంప్యూటర్స్‌తో పేరుతో సింగపూర్‌లో ఐటీ హార్డ్‌వేర్‌ను విక్రయించారు. 1982లో హెచ్‌సీఎల్ పర్సనల్ కంప్యూటర్లను మార్కెట్‌లోకి తెచ్చింది. ఇక అప్పటి నుంచి ఆయన వెనుతిరిగి చూసుకోలేదు. హెచ్‌సీఎల్ మార్కెట్ క్యాప్ ఇప్పుడు రూ.1.7 లక్షల కోట్లుగా ఉంది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్‌లో భారత్ దూసుకెళ్తోందంటే శివనాడార్ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీల్లో హెచ్‌సీఎల్ టెక్ కూడా ఒకటి.