కొత్త రికార్డ్ : నిబంధనలు ఉల్లంఘించిన వాహనానికి 1.41లక్షల ఫైన్

  • Published By: venkaiahnaidu ,Published On : September 11, 2019 / 03:01 AM IST
కొత్త రికార్డ్ : నిబంధనలు ఉల్లంఘించిన వాహనానికి 1.41లక్షల ఫైన్

ట్రాఫిక్ కొత్త రూల్స్ వాహనదారుల్లో వణుకుపుట్టిస్తున్నాయి. బండి తీయాలంటే గుండెల్లో గుభేల్ అంటోంది. ఎక్కడ ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారోనని హడలి చస్తున్నారు.  ఏ ఒక్కటి మిస్ అయినా ఫైన్ మోత మోగిపోవడం ఖాయం. ఒక్క డాక్యుమెంట్ లేకున్నా భారీ జరిమానాలు చెల్లించాల్సిన పరిస్థితి. వాహనదారులు రోడ్డు మీదికి రావాలంటేనే భయపడిపోతున్నారు.

సెప్టెంబర్ 1 నుంచి కొత్త మోటర్ వాహనాల చట్టం అమల్లోకి రావడంతో కొన్నిరోజులుగా వందల సంఖ్యలో వాహనదారులకు భారీగా చలాన్లు నమోదయ్యాయి. వేలాది రూపాయల జరిమానాలు చెల్లించాల్సి వచ్చింది. ఫైన్ కట్టలేక బైక్‌నే వదిలేసి వెళ్లిన ఘటన, ఫైన్ చూసి బండినే ట్రాఫిక్ పోలీస్ ఎదుట తగులబెట్టిన ఘటనలు  ఇటీవల చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

అయితే సోమవారం(సెప్టెంబర్-9,2019)రాజస్థాన్ కు చెందిన ఓ వాహనం కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. నిబంధనలు ఉల్లంఘించినందుకుగాను ఆ వాహనానికి ఢిల్లీలోని రోహిణీ సర్కిల్ పోలీసులు 1.41లక్షల ఫైన్ విధించారు. కొత్త మోటర్ వాహనాల చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి దేశంలో ఇదే అత్యధిక ట్రాఫిక్ ఫైన్. భగవాన్ రామ్ అనే వ్యక్తి ఈ ఫైన్ ను డిపాజిట్ చేసినట్లుగా రసీదులో కన్పిస్తోంది. జరిమానా విధించబడిన వాహనం టాటా 4018.s హెవీ డ్యూటీ ట్రక్ అని తెలుస్తుంది. ఇది రాజస్థాన్ లోని బికనీర్ ఆర్టీఓ క్రింద రిజిస్ట్రర్ చేయబడింది.