తిండి కూడా తిననివ్వరేమో: ఆటో డ్రైవర్ కు రూ.32వేలు ఫైన్

  • Edited By: vamsi , September 4, 2019 / 11:03 AM IST
తిండి కూడా తిననివ్వరేమో: ఆటో డ్రైవర్ కు రూ.32వేలు ఫైన్

దేశవ్యాప్తంగా మోటారు వాహన చట్టం మారిపోయింది. ట్రాఫిక్ పోలీసులు బాధుడు మొదలెట్టేశారు. భారీగా జరిమానాలు వేసేస్తున్నారు. ఈ విషయంలో సామన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లేటెస్ట్ గా హెల్మెట్ ధరించకుండా బైక్ నడుపుతుండగా పట్టుకున్న వ్యక్తికి రూ.23వేలు ఫైన్ వేసిన విషయం మర్చిపోకముందే, రోజూ ఆటో తోలుకుని పొట్ట నింపుకునే వ్యక్తికి రూ. 32వేల 500 చలానా వేశారు ట్రాఫిక్ పోలీసులు.

ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని సికందర్‌పూర్‌లో 26వ సెక్టార్ లో చోటు చేసుకుంది. మహ్మద్ ముస్తాకిల్ అనే ఆటో రిక్షా డ్రైవర్ ను ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. ఆ సమయంలో పత్రాలను చూపించమని అధికారి అడగగా అతను వాటిని డిఎల్ఎఫ్ ఫేజ్-3లోని తన ఇంట్లో మరిచిపోయినట్లు చెప్పారు.

తనకు 10 నిమిషాల సమయం ఇస్తే అన్నీ పత్రాలను చూపిస్తానని అందుకు అవకాశం ఇవ్వాలని ట్రాఫిక్ పోలీసు అధికారిని వేడుకున్నాను. అయితే పోలీసులు అతని మాట వినలేదు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా రూ.32వేల 500 లను చలానాగా విధించారు. 

లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు రూ. 5,000, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేనందుకు రూ .5,000, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రూ .2,000, పొల్యూషన్ సర్టిఫికేట్ రూ .10,000, సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ రూ .500, ప్రమాదకరమైన డ్రైవింగ్ రూ. 5,000 మరియు ట్రాఫిక్ లైట్ జంపింగ్ రూ. 5,000. మొత్తం రూ. 32వేల 500 జరిమానా విధించారు.

ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేసేందుకు రోడ్టు భద్రతను మెరుగుపరిచేందుకు పార్లమెంట్ లో మోటారు వాహనాల బిల్లును కేంద్రం ఆమోదించింది. ఈ చట్టం ఆదివారం(01 సెప్టెంబర్ 2019) హర్యానాలో అమల్లోకి వచ్చింది. ఈ విషయంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొట్టకూటి కోసం నడుపుకునే ఆటోని కూడా సీజ్ చేసి తిండికి డబ్బు లేకుండా చేస్తున్నారు అని అంటున్నారు.