శ్రామిక్ స్పెషల్ రైళ్ల ద్వారా రైల్వేలకు రూ.360 కోట్ల లాభాలు

  • Published By: bheemraj ,Published On : June 22, 2020 / 05:42 PM IST
శ్రామిక్ స్పెషల్ రైళ్ల ద్వారా రైల్వేలకు రూ.360 కోట్ల లాభాలు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో (మే 1, 2020) తేదీ నుంచి శ్రామిక్ స్పెషల్ రైళ్లు నడుస్తున్నాయి. 60 లక్షల మంది వలస కూలీలను వారి గమ్యస్థానానికి రవాణా చేశాయని భారత రైల్వే తెలిపింది. ఈ సమయంలో 4450 రైళ్లు నడపగా.. రూ.360 కోట్లు అద్దెగా సంపాదించింది. ఈ కాలంలో తలసరి అద్దె సగటు రూ.600 గా రైల్వే శాఖ పేర్కొంది. 

రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ మాట్లాడుతూ శ్రామిక్‌ స్పెషల్ రైలును నడపడానికి సుమారు రూ.80 లక్షల ఖర్చు అవుతుందన్నారు. రైల్వేలు 85 శాతం ఖర్చులను భరిస్తుండగా, ఆయా రాష్ట్రాలు 15 శాతం భరిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ శ్రామిక్‌ రైళ్లకు సగటు ఛార్జీలు ఒక్కో ప్రయాణికుడికి రూ.600 వసూలు చేశారని, ఇది మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైలుకు సాధారణ ఛార్జీ అని, ప్రత్యేక రైలు దాని కంటే ఎక్కువ వసూలు చేస్తుందని తెలిపారు. ఈ రైళ్ల ద్వారా 60 లక్షల మందిని వారి గమ్యస్థానానికి రవాణా చేశామని పేర్కొన్నారు. 

(జూన్ 3, 2020) వరకు వారి అవసరాలకు అనుగుణంగా రైళ్ల డిమాండ్ గురించి వివిధ రాష్ట్రాలను అడిగామని, 171 మంది కార్మికుల ప్రత్యేక రైళ్లను అందించాల్సిందిగా కోరినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి జూన్ 14 న అదనపు రైళ్ల డిమాండ్ గురించి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలను అడిగామని, రాష్ట్రాల డిమాండ్ కొనసాగుతున్నంతవరకు రైళ్లను నడుపుతూనే ఉంటామని తెలిపారు. జూన్, జూలై నెలల్లో ఈ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ ఉండదని వెల్లడించారు.

ఈ శ్రామిక్‌ స్పెషల్ రైళ్లు పనిచేయడం ప్రారంభించినప్పుడు.. వలస కూలీల నుంచి రైల్వే ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు రాజకీయ పార్టీలు ఆరోపించాయి. దీని తరువాత టికెట్ మొత్తంలో 15 శాతం సంబంధిత రాష్ట్రం నుంచి తీసుకుంటున్నామని తెలిపారు. 85 శాతం మొత్తాన్ని రైల్వే భరిస్తుందని స్పష్టం చేసింది.