తెలంగాణలో RSS వ్యాప్తికి పకడ్బందీ వ్యూహాలు, స్టూడెంట్సే టార్గెట్

తెలంగాణలో RSS వ్యాప్తికి పకడ్బందీ వ్యూహాలు, స్టూడెంట్సే టార్గెట్

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) తెలంగాణలో విస్తరించేందుకు పకడ్బందీ వ్యూహాలతో ముందుకెళ్తుంది. 2024 నాటికి కనీసం 5 లక్షల సభ్యత్వాలే వాళ్ల టార్గెట్. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 10 వేల గ్రామాల్లో బ్రాంచులు ఏర్పాటు చేయాలనుకుంటుంది. 2025కి ఆర్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భవించి వందేళ్లు అవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా తన ఉనికిని ఘనంగా చాటుకునేందుకు వేగవంతంగా కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా జనవరి 24 నుంచి 3 రోజులపాటు హైదరాబాద్‌ శివార్లలోని భారత్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో విజయ సంకల్ప శిబిరం పేరుతో సమాయత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. 

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్‌ భాగవత్‌ అధ్యక్షతన జరిగే ఈ శిబిరానికి ఏడున్నర వేల మంది కార్యకర్తలు రానున్నారు. రాజకీయ పార్టీలతో పోలిస్తే ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రణాళిక భిన్నంగా ఉంటుంది. హిందుత్వ భావజాల విస్తరణే ప్రధాన లక్ష్యం అయినా సామాజిక అంశాలపై స్పందిస్తూ ప్రజల్లోకి వెళ్లడమే ఆర్ఎస్ఎస్ స్పెషల్. ఐదు లక్షల సభ్యత్వాల్లో సగం విద్యార్థులవి కావడమే ప్రధాన లక్ష్యం. ఈ మీటింగ్‌లో స్టూడెంట్స్‌ను ఆకట్టుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. 

మద్యపానం తగ్గించడం, అక్షరాస్యత పెంపు, మహిళలను గౌరవించడం, వారికి రక్షణగా ఉండటం, వలసల నివారణ, సేంద్రియ వ్యవసాయం, గోవుల వృద్ధిపై ముమ్మర ప్రచారం చేయనుంది. కులాల మధ్య అంతరాల వల్ల హిందుత్వ భావజాలానికి ఇబ్బందిగా మారిందన్న ఉద్దేశంతో ఈ విషయంలో కూడా ప్రత్యేక దృష్టి సారించారు. సమ రసత కార్యక్రమం పేరుతో గ్రామాల్లో అన్ని కులాల వారు ఆలయ పూజల్లో పాల్గొనేలా చేయడంతోపాటు ఊరంతటికీ ఒకే శ్మశాన వాటిక ఉండేలా చూడాలన్నది ఆర్‌ఎస్‌ఎస్‌ ఆలోచన. ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించడం, విరివిగా మొక్కల పెంపకం, జల సంరక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. 

ఉమ్మడి రాష్ట్రంలో 20 ఏళ్ల క్రితం ఆర్‌ఎస్‌ఎస్‌ స్థానికంగా ముఖ్య శిక్షక్, కార్యకర్తలకు మీటింగ్‌లు నిర్వహించింది. 1999లో కర్నూలు, కరీంనగర్‌లలో వాటిని ఏర్పాటు చేసింది. 2017లో కరీంనగర్‌లో సాధారణ శిబిరం, ఘట్‌కేసర్‌ సమీపంలో జాతీయ స్థాయి కార్యనిర్వహక కమిటీ సమావేశాలు జరిగినా రాష్ట్రవ్యాప్త మీటింగ్ మాత్రం ఇప్పుడే జరగనుంది. రెండేళ్ల క్రితం రాష్ట్రంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు 2వేల 500 శాఖలు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 3వేల 200కు పెరిగింది. వాటిని 12 వేలకు పెంచాలనేది తాజా లక్ష్యం. శిబిరంలో భద్రాద్రి, యాదాద్రి, సమ్మక్క సారలమ్మ, జోగులాంబ, భాగ్యలక్ష్మి పేరుతో 5 విభాగాలు ఏర్పాటు చేశారు. 24న ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు సమావేశాలు ఉంటాయి.