రాజకీయాలతో మాకు సంబంధం లేదు : RSS చీఫ్ మోహన్ భగవత్

  • Published By: chvmurthy ,Published On : January 18, 2020 / 03:51 PM IST
రాజకీయాలతో మాకు సంబంధం లేదు : RSS చీఫ్ మోహన్ భగవత్

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని సంస్ధ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఉత్తర ప్రదేశ్ లోని మొరాదాబాద్ లో  నాలుగు రోజులపాటు జరిగిన స్వయం సేవకుల ముగింపు శిక్షణా శిబిరంలో మాట్లాడుతూ ఆయన  ఆర్ఎస్ఎస్ దేశంలో నైతిక, సాంస్కృతిక, మానవతా  విలువలు పెంపొందించటానికే పని చేస్తుందని చెప్పారు.  

ఎన్నికలతో మాకు సంబంధంలేదని.. గత 60 సంవత్సరాలుగా దేశం  కోసం.. ఉన్నత విలువలు కాపాడటం కోసమే ఆర్ఎస్ఎస్ పని చేస్తోందని ఆయన చెప్పారు. దేశంలోని 130 కోట్ల భారతీయుల కోసం ఆర్ఎస్ఎస్ పనిచేస్తోందన్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ  ను నడిపిస్తోందని  వచ్చిన వార్తలను ఆయన ఖండించారు.

భూదాన్ ఉద్యమ వ్యవస్థాపకుడు వినోబా భావే వంటి కొందరు సంఘ సంస్కర్తల   పేర్లను ఊదహరిస్తూ “చాలా మంది అగ్రశ్రేణి మేధావులు మరియు సామాజిక సంస్కర్తలు ఆర్ఎస్ఎస్ కి మిత్రులు కాని వారు ఉన్నారని…..వారందిరిలోనూ మా భావ జాలమే ఉందని, వారు మా కార్యకర్తలు కాకాపోయినా వారందరూ మా స్నేహితులే అని…..ఇది మా విజయం” అని ఆయన నొక్కి చెప్పారు.

రష్యా, చైనా, యుఎస్ఎ లు సమస్యలను సృష్టించే శక్తివంతమైన దేశాలని, యుఎస్ఎ తన గౌరవాన్ని కోల్పోతోందని ఆయన  వ్యాఖ్యానించారు. 1925 లో ఆర్‌ఎస్‌ఎస్ను చాలా కొద్ది మంది వ్యక్తులతో ప్రారంభించారని..అయితే దేశ నిర్మాణానికి నిరంతర అంకితభావం తో పనిచేయటం  కారణంగా దేశవ్యాప్తంగా లక్షా 30 వేల శాఖలతో ఒక సంస్థగా ఎదిగిందని ఆయన చెప్పారు. 

తమ సంస్ధ రాజ్యాంగవిలువలకు కట్టుబడి పని చేస్తుందని.. వ్యక్తిగత  ప్రయోజనాలు పక్కన పెట్టిదేశ సేవ కోసం పనిచేసే ఉత్సాహం ఉన్ననవారిని తాము ఎప్పుడూ ఆహ్వనిస్తామని మోహన్ భగవత్ చెప్పారు. దేశంలోని  భారతీయులందరూ హిందువులేనని… వారి  పూర్వీకులు అంతా హిందువులేనని ఆయన చెప్పారు.

ప్రపంచంలోని అనేక దేశాలు  వైవిధ్యం నుండి ఐక్యత అని నినాదాలు ఇస్తున్నాయని…కానీ భారత దేశంలో ఐక్యత లోనే వైవిధ్యం ఉందని అన్నారు. కాగా…… భగవత్ తన ప్రసంగంలో ఎక్కడా పౌరసత్వం సవరణ చట్టం మరియు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ పై  వ్యాఖ్యానించలేదు.