ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్ధ : రాజారత్న అంబేద్కర్ సంచలన వ్యాఖ్యలు

  • Published By: chvmurthy ,Published On : January 27, 2020 / 11:31 AM IST
ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్ధ : రాజారత్న అంబేద్కర్ సంచలన వ్యాఖ్యలు

భారత దేశంలో ఆర్ఎస్ఎస్ ఒక ఉగ్రవాద సంస్ధ అని దాన్ని నిషేంధించాలని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ మనవడు రాజారత్నం అంబేద్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిపబ్లిక్ డే రోజున కర్ణాటకలోని బెంగుళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయనీ కామెంట్స్ చేారు. భారత దేశ ఉగ్రవాద సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ అని గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థను దేశంలో నిషేధించాలని డిమాండ్‌ చేశారు.

బీజేపీ ఎంపీ సాధ్వి ప్రాగ్యా సింగ్ ఠాకూర్.. మోడీ పక్కన కూర్చొని మాట్లాడుతూ.. భారత ఆర్మీలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి అయిపోయినప్పడు.. ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థ ఆర్మీకి వాటిని అందించిందని ఆమె చెప్పినట్లు రాజారత్న పేర్కొన్నారు. దీన్ని బట్టే ఆ సంస్థ టెర్రరిస్టు ఆర్గనైజేషన్ అని తెలుస్తుందన్నారు. అసలు ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థకు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఎక్కడ్నుంచి వచ్చిందని రాజారత్న అంబేడ్కర్‌ ప్రశ్నించారు.

ఎవరి ఇంట్లోనైనా బాంబులు, తుపాకీలు లాంటివి పోలీసులు రికవరీ చేస్తే ఆ ఇంటిని, అందులోని మనుషుల్ని టెర్రరిస్టులని కాకుండా మరేమనాలని అడిగారు. ఒక సంస్థ దగ్గర ఇవి ఉంటే ఉగ్రవాద సంస్థ అని అనకూడదా అన్నారు. టెర్రరిస్టు కార్యకలాపాల్లో ఆర్ఎస్ఎస్ వ్యక్తులు అరెస్టు అవుతున్నారని, ఇలాంటి సంస్థలను నిషేధించాలని డిమాండ్ చేశారు రాజారత్న.

ఆర్ఎస్ఎస్.. ఉగ్రవాద సంస్థ అంటూ రాజారత్న అంబేడ్కర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. రాజారత్న వ్యాఖ్యలను వారు ఖండించారు. నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదన్నారు. దేశ ప్రయోజనాల కోసం, భారతీయత కోసం పని చేస్తున్న ఏకైక సంస్థ ఆర్ఎస్ఎస్ అని చెప్పారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం తగదని హితవు పలికారు.