బ్యాంకుల విలీనంపై బీఎంఎస్ ఆగ్రహం

  • Published By: chvmurthy ,Published On : September 1, 2019 / 11:27 AM IST
బ్యాంకుల విలీనంపై బీఎంఎస్ ఆగ్రహం

బ్యాంకుల విలీన ప్రక్రియ గురించి కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంటే…రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) కార్మిక విభాగం భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎమ్ఎస్) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.  పది బ్యాంకుల్ని నాలుగు బ్యాంకులుగా విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టింది. గత అనుభవాల్ని ఏమాత్రం లెక్కచేయకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని బీఎమ్ఎస్ విమర్శించింది. ఎలాంటి అధ్యయనం లేకుండానే బ్యాంకుల విలీన ప్రక్రియ చేపట్టారని, ఇది కార్పొరేట్లకు మాత్రమే ఉపయోగపడుతుందని తీవ్రస్ధాయిలో విమర్శలు చేసింది. 
 
బ్యాంకుల విలీనం పై సరైన అధ్యయనం జరగలేదని… గతంలోని తప్పుడు అనుభవాల నుంచి ప్రభుత్వం ఏమీ నేర్చుకోలేదని అర్ధమవుతోందని బీఎంఎస్ ఆల్ ఇండియా అధ్యక్షుడు సాజి నారాయణన్ అన్నారు. దీనివల్ల ఉద్యోగుల తొలగింపు, ఉపసంహరణ లాంటివి ఉంటాయని, ఉద్యోగుల్లో అభద్రతాభావం నెలకొంటుందని అన్నారు.  విలీన ప్రక్రియ వలన కార్పొరేట్లకు మాత్రమే ఉపయోగమని, సాధారణ ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. 
 
బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్లు  ఆధ్వర్యంలో త్వరలో నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ఈ ఆందోళనకు తాము పూర్తి మద్దతు ఇస్తామని సాజి నారాయణన్ ప్రకటించారు. బీఎంఎస్ ఎక్కువ మంది సభ్యులతో దేశంలోనే అతిపెద్ద ట్రేడ్ యూనియన్‌గా ఉంది.