కాసేపట్లో పెళ్లి….11కిలోమీటర్లు పరుగెత్తిన వరుడు

10TV Telugu News

పెద్దలు అంగీకరించరని భావించిన ప్రేమికులు ఇంట్లోంచి పారిపోవడాన్ని సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ చూస్తుంటాం. రోజూ ఎక్కడో ఒక దగ్గర ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం. ఇండోర్‌లో ఓ పెళ్లి కొడుకు ఏకంగా 11 కిలోమీటర్లు పరిగెత్తాడు. అతడి వెనకో 50 మంది పరుగులు తీశారు. రోడ్డుపై వారిని చూసిన జనాలు అతడిని దొంగగా భావించారు. అతడిని పట్టుకునేందుకు వెంట పడుతున్నారని ఓ నిర్ణయానికి వచ్చేశారు. అయితే, పెళ్లి దుస్తుల్లో ఉన్న అతడిని చూసి అనుమానించారు. అసలు విషయం తెలిసి అందరూ షాకయ్యారు. 

మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌కు చెందిన నీరజ్ మాలవీయకు పెళ్లి కుదిరింది. పెళ్లికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బరాత్‌ బృందంతో కలిసి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్యాణ మండపానికి అందరూ బయలుదేరారు. అయితే, మామూలుగా కాదండోయ్…పెళ్లి దుస్తుల్లో ఉన్న మాలవీయ ముందు పరుగు పెడుతుంటే అతడి వెనక బరాత్ బృందం పరుగులు తీసింది. వారిలో 70 ఏళ్ల వయసున్న వారు కూడా ఉన్నారు. అందరూ కలిసి రోడ్డుపై పరుగులు తీస్తుంటే మొదట అందరూ ఆశ్చర్యపోయారు. వారి పరుగు 11 కిలోమీటర్ల మేర కొనసాగింది.
 
అసలు విషయం ఏంటంటే.. నీరజ్ మాలవీయ ఫిట్‌నెస్ ట్రైనర్. తన వివాహం సందర్భంగా ‘ఆరోగ్యకరమైన జీవితం’పై అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన ప్లాన్‌ను కుటుంబ సభ్యులకు చెప్పాడు. బరాత్ బృందం కూడా ఇందుకు అంగీకరించింది. దీంతో అందరూ కలిసి రోడ్డుపై జాగింగ్ చేస్తూ పెళ్లి మండపానికి పయనమయ్యారు. ఆరోగ్యంపై అతడికి ఉన్న శ్రద్ధను చూసిన నీరజ్ అత్తమామలు, కుటుంబ సభ్యులు కూడా ముచ్చపట్టడారు. ఆరోగ్యకరమైన జీవితంపై అవగాహన కల్పించేందుకు అతడు ఎంచుకున్న మార్గం గొప్పగా,కొత్తగా ఉందంటూ నీరజ్‌ పై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.