సచిన్ వాజే “వసూళ్ల రాకెట్” నడిపింది ఆ ఫైవ్ స్టార్ హోటల్ నుంచే : NIA

రిలయన్స్ ఇండస్ట్రీస్​ అధినేత​ ముకేశ్​ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల వాహనం కేసులో అరెస్టైన సచిన్‌ వాజే గురించి.. తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

సచిన్ వాజే “వసూళ్ల రాకెట్” నడిపింది ఆ ఫైవ్ స్టార్ హోటల్ నుంచే : NIA

Sachin Waze

Sachin Waze రిలయన్స్ ఇండస్ట్రీస్​ అధినేత​ ముకేశ్​ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల వాహనం కేసులో అరెస్టైన సచిన్‌ వాజే గురించి.. తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముంబైలోని నారిమన్‌ ప్రాంతంలో ఓ ఫైవ్ స్టార్ హోటల్‌ నుంచి సచిన్ వాజే ‘బలవంతపు వసూళ్ల’ రాకెట్‌ను నడిపాడని NIA దర్యాప్తులో తేలింది. ఆ హోటల్‌లోని రూమ్​ నంబర్ 1964ను వాజే కోసం ఓ వ్యాపారవేత్త ట్రావెల్‌ ఏజెంట్‌ ద్వారా రూ. 12లక్షలు చెల్లించి 100 రోజులకు బుక్‌ చేసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఈ హోటల్‌లోని 1964 నంబర్ గదిపై అధికారులు దృష్టిపెట్టారు.

ఈ హోటల్‌ గదికి వాజే.. ‘సుశాంత్‌ సదాశివ్‌ ఖామ్కర్‌’ పేరుతో నకిలీ ఆధార్‌ కార్డుతో చెకిన్‌ అయినట్లు సమాచారం. ఫిబ్రవరిలో వాజే ఇదే గదిలో కొన్ని రోజుల పాటు ఉన్నారు. ఆ సమయంలో ఆయన ముంబయి క్రైం బ్రాంచ్‌లో విధుల్లోనే ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. ఫిబ్రవరి 16న వాజే టయోటా ఇన్నోవా కారులో ఈ హోటల్‌కు వచ్చారు. ఆ తర్వాత ఫిబ్రవరి 20న క్రూయిజర్‌ కారులో వెళ్లిపోయారు. అదే సమయంలోనే వాజే బృందం ముంబయిలోని పలు ప్రముఖ సంస్థల్లో లైసెన్స్‌ నిబంధనల ఉల్లంఘనలపై తనిఖీలు నిర్వహించడం గమనార్హం. ఆ హోటల్ వద్ద వాజే కన్పించిన ఆ రెండు కార్లు ప్రస్తుతం ఎన్‌ఐఏ స్వాధీనంలో ఉన్నాయి. దీంతో ఈ హోటల్‌లోని 1964 నంబర్ గదిపై అధికారులు దృష్టిపెట్టారు.

ఇదిలా ఉండగా.. పేలుడు పదార్థాల కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేసిన ఎన్‌ఐఏ.. గురువారం దక్షిణ ముంబైలోని ఓ హోటల్‌, క్లబ్‌తో పాటు ఠాణె జిల్లాలోని ఓ అపార్ట్‌మెంట్‌లోనూ సోదాలు నిర్వహించింది. అదే రోజున ముంబై ఎయిర్‌పోర్టులో వాజే సన్నిహితురాలిగా అనుమానిస్తున్న ఓ మహిళను అదుపులోకి తీసుకుంది. ఠాణెలో ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించిన అపార్ట్‌మెంట్‌.. ఆమె పేరు మీదే ఉంది. దీంతో ఈ మహిళకు, వాజేకు ఉన్న సంబంధంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అంబానీ ఇంటి వద్ద వాహనం కేసులో లేదా మన్‌సుఖ్‌ హిరేన్‌ హత్య కేసులో ఆమెకు ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల వాహనం కేసు, మన్‌సుఖ్‌ హిరేన్‌ మృతి కేసుల్లో ఎన్‌ఐఏ దర్యాప్తు కార్ల చుట్టూ తిరుగుతోంది. ముంబైలోని అంబానీ నివాసం వద్ద కలకలం రేపిన స్కార్పియోతో మొదలు ఔట్‌ల్యాండర్‌ వరకు 7 కార్లను ఇప్పటివరకు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మరో మెర్సిడెస్‌ కారును కూడా ఎన్‌ఐఏ కార్యాలయానికి తీసుకొచ్చారు. వీటిలో కొన్ని వాహనాలకు ముంబై నగర పోలీస్‌ కమిషనరేట్‌తో సంబంధం ఉన్నట్లు తేలింది. వాజే ‘వ్యాపారం’ గురించి సీనియర్‌ పోలీసు అధికారుల్లో చాలా మందికి తెలుసని.. దీనికి సంబంధించి తమ వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని ఎన్‌ఐఏ అధికారులు చెప్పారు. ఇప్పటివరకు ఈ కేసుల్లో 35 మంది అధికారులును దర్యాప్తు సంస్థ ప్రశ్నించింది. రానున్న రోజుల్లో మరి కొంతమందిని అరెస్ట్​ చేసే అవకాశమున్నట్లు సమాచారం.