అమ్మకదా : వెంట్రుకలు అమ్మి బిడ్డల ఆకలి తీర్చింది

  • Published By: veegamteam ,Published On : January 10, 2020 / 07:56 AM IST
అమ్మకదా : వెంట్రుకలు అమ్మి బిడ్డల ఆకలి తీర్చింది

ఆకలికి పేద గొప్పా తేడా తెలియదు. తినటానికి తిండి లేకపోయినా ఆకలి అనేది మనిషికే కాదు ప్రతీ జీవికి సర్వసాధారణం. అలా కడుపేదరికంలో మగ్గిపోతున్న ఓ తల్లి కడుపున బిడ్డలకు పట్టెడన్నం పెట్టటానికి చేసిన పని మనస్సుల్ని కలచివేస్తోంది. ఆకలితో అలమటించుపోతున్న తన ముగ్గురు పిల్లల కడుపు నింపటానికి ఆమె గుండు చేయించుకుంది. ఆ వెంట్రుకల్ని అమ్మి బియ్యం కొని అన్నం వండి పెట్టి బిడ్డల ఆకలి తీర్చింది. హృదయాల్ని ద్రవింపజేసే ఈ ఘటన తమిళనాడులోని సేలం నగరం సమీపంలోని పొన్నంపేటలో జరిగింది. 

పొన్నంపేట ప్రాంతానికి చెందిన ప్రేమకు ముగ్గురు పిల్లలు. ప్రేమ భర్త ఏడు నెలల క్రితం చనిపోయాడు. ఎన్నో అప్పులు చేసి వాటిని తీర్చలేక భార్యను..ముగ్గురు పిల్లల్ని  అప్పుల్లో ముంచి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ప్రేమ తన 5,3,2 ఏళ్ల వయసు గల ముగ్గురు పిల్లలు వీధిన పడ్డారు. ఇంట్లో అన్నింటిని అమ్మివేసింది. చివరికి బిడ్డల కోసం బంధువులను,ఇరుగు..పొరుగువారిని డబ్బులు అడిగింది. కానీ ఎవ్వరూ ఇవ్వలేదు. దీంతో బిడ్డల ఆకలి తీర్చాలేకపోతున్నందుకు విలపించింది. 

ఆకలితో అల్లాడిపోతున్న బిడ్డల మొహం చూడాలంటే కూడా ప్రేమకు ధైర్య సరిపోలేదు. అలా ఏం చేయాలా? అని ఆలోచిస్తున్న ప్రేమకు ఓ  వ్యక్తి వెంట్రుకలు కొంటాం అనే పిలుపు వినిపించింది. గబా గబా పరుగెత్తుకుంటూ వెళ్లి అతన్ని పిలిచింది. వెంటనే గుడిసెలోకి పరుగెత్తుకెళ్లి తన జుట్టును కత్తిరించి తీసుకొచ్చి..అతనికి ఇచ్చింది. ఆ జుట్టుకు అతను రూ.150 రూపాయలు ఇచ్చాడు. వెంటనే దుకాణానికి పరుగు పరుగున వెళ్లి బియ్యం కొని అంతకంటే స్పీడ్ గా పరుగెత్తుకుంటూ గుడిసెకు చేరుకుని గబాగబా అన్నం వండి పిల్లల ముగ్గురికి పెట్టింది. అసలే ఆకలితో అల్లాడిపోతున్న ఆ పిల్లలు ఆబగా అన్నం తింటుంటే ఈరోజు ఇలా గడిచింది. మరి రేపటి సంగతి ఎలా? నా బిడ్డల ఆకలి ఎలా తీర్చాలి? అంటూ ఆవేదన చెందింది. 

ప్రేమ దుర్భర స్థితి తెలుసుకున్న బాలా అనే గ్రాఫిక్ డిజైనర్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆమెకు నెటిజన్లు రూ.1.45 లక్షల ఆర్థికసహాయం చేశారు. బాలా స్నేహితుడు కూడా తన వంతు సహాయం అందించాడు ప్రేమకు. ఆమెకు ఓ ఇటుకబట్టీల్లో పనికి కుదిర్చాడు. ప్రేమ దుర్భరస్థితిని తెలుసుకున్న సేలం జిల్లా అధికారులు వెంటనే స్పందించారు. ప్రేమకు వితంతు పెన్షన్ ను మంజూరు చేశారు. 

ఈ సందర్బంగా ప్రేమ మాట్లాడుతూ..తన కష్టాలు తెలుసుకుని సహాయం చేసినవారికి ప్రేమ ధన్యవాదాలు తెలిపింది. ఇకపై తాను ఎప్పుడు ఆత్మహత్య చేసుకోననీ..బిడ్డల్ని చక్కగా చదివిస్తానని తెలిపింది. ఈ ధైర్యాన్ని తనకిచ్చినవారందరికి ధన్యవాదాలు అని తెలిపింది. 

ఈ సందర్భంగా ప్రేమకు సహాయం చేసిన గ్రాఫిక్ డిజైనర్ బాలా మాట్లాడుతూ..తాను కూడా ఒకప్పుడు ప్రేమ పరిస్థితిలోనే తన తల్లి కూడా ఉండేదనీ..తన చిన్నతనంలో తినటానికి తిండి లేకపోతే మా అమ్మ పాత పేపర్లు అమ్మి బియ్యం కొని అన్నం వండి మాకు పెట్టేదని తెలిపారు. ఒక పరిస్థితిలో అయితే తన తల్లి కూడా ఆత్మహత్య చేసుకోవటానికి యత్నించిందనీ తన అనుభవాలను పంచుకున్నారు. కానీ ఆరోజు తన  తల్లి ఆత్మహత్య చేసుకుని ఉంటే స్వంత కారు కొనుకున్న కొడుకును  చూడలేకపోయేదనీ అందుకే తన తల్లిని ఎంతో అపురూపంగా చూసుకుంటున్నానని బాలా తెలిపారు. నా స్వంత కారులో నా తల్లిని దర్జాగా తిప్పుతున్నానని సంతోషంగా తెలిపారు బాలా.  

కాగా ప్రేమ భర్తకూడా బతికి ఉన్నప్పుడు చిన్న ఇటుకల బట్టీ నడిపేవాడు. కానీ తీవ్రంగా నష్టపోవటంతో వ్యాపారం కోసం చేసిన రూ.2.5 లక్షల అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తరువాత ఆ అప్పు తీర్చమని ప్రేమను వేధించారు. దీంతో అప్పు తీర్చలేక..బిడ్డల ఆకలి చూడలేక…బిడ్డలతో సహా ప్రేమ ఆత్మహత్య చేసుకోవానుకుంది. కానీ అదృష్టవశాత్తు ప్రేమ సోదరి ఆపటంతో బతికిబైటపడ్డారు. అలా బైటపడిన ప్రేమ ఎంతోమంది ఇచ్చి చేయూతతో తన పిల్లల్ని చక్కగా చూసుకుంటోంది. వారిని చదివించి ప్రయోజకుల్నిచేస్తానని ఆత్మవిశ్వాసంతో చెబుతోంది.