డ్రాగన్ కు Samsung ఝలక్ : చైనాలోని ముఖ్యమైన ప్రొడక్షన్ యూనిట్ భారత్ కు తరలింపు

  • Published By: venkaiahnaidu ,Published On : December 13, 2020 / 05:16 PM IST
డ్రాగన్ కు Samsung ఝలక్ : చైనాలోని ముఖ్యమైన ప్రొడక్షన్ యూనిట్ భారత్ కు తరలింపు

Samsung to move key production unit from China to Noida సౌత్ కొరియా టెక్ దిగ్గజం “శామ్‌సంగ్” చైనాకు గట్టి షాక్ ఇచ్చింది. చైనాలోని తమ “మొబైల్, ఐటీ డిస్‌ప్లే” ప్రొడక్షన్ యూనిట్ ను భారత్ లోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాకి తరలించిందేందుకు శామ్‌సంగ్ సిద్ధమైంది. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ధృవీకరించింది. యూపీ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ…శామ్‌సంగ్ కంపెనీ భారత్ లో రూ.4,825కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇందులో భాగంగానే చైనాలోని తమ మొబైల్,ఐటీ డిస్‌ప్లే యూనిట్ ను నోయిడాకి తరలించనుందని తెలిపారు.

శామ్‌సంగ్ కంపెనీకి తగిన వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. ఇది దేశంలో ఏర్పాటు చేసే మొదటి హై టెక్నిక్ ప్రాజెక్టు అని తెలిపారు. ప్రపంచంలో ఇలాంటి యూనిట్ ఉన్న మూడో దేశంగా భారత్ నిలవనుందని ఆయన వెల్లడించారు. నోయిడాలో ఏర్పాటు చేయబోయే యూనిట్‌ తో 1500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. వేలాది మందికి పరోక్షంగా ఉపాధి కలగనుందని తెలిపారు.

కాగా,నోయిడాలో ఏర్పాటు చేయనున్న శామ్‌సంగ్ డిస్ ప్లే ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇచ్చే ప్రోత్సాహకాలకు సీఎం యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. మరోవైపు, ఇప్పటికే శామ్‌సంగ్ సంస్థకు నోయిడాలో మొబైల్ ఉత్పత్తి యూనిట్ ఉంది. 2018లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన విషయం తెలిసిందే..ఇక యూపీ నుంచి అత్యధికంగా ఎగుమతులు చేస్తున్న సంస్థ శామ్‌సంగ్. గత ఏడాది 2.7 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను కంపెనీ.. విదేశాలకు ఎగుమతి చేసింది. వచ్చే ఐదేళ్లో వీటి విలువను 50 బిలియన్ డాలర్ల పెంచాలని టార్గెట్ పెట్టుకుంది

ఇప్పటి వరకూ శామ్ సంగ్ టీవీ సెట్లు, మొబైల్స్ వాచీలు, ట్యాబ్లెట్లలో వాడే డిస్ ప్లే ఉత్పత్తుల్లో 70 శాతం దక్షిణ కొరియా వియత్నాం చైనాల్లో ఉత్పత్తి అవుతున్నాయి. ప్రొడక్షన్ అనుసంధానిత రాయితీల పథకం కింద భారత ప్రభుత్వం యాపిల్ సంస్థ భాగస్వాములైన ఫాక్స్ కాన్ విస్ట్రన్ పెగాట్రాన్ కు అనుమతులు ఇచ్చిన తర్వాత శామ్ సంగ్ తమ డిస్ ప్లే యూనిట్ ని భారత్ కు తరలించనున్నట్లు ప్రకటించింది. రూ.15 వేల ధరలో మొబైల్ ఫోన్లు ఉత్పత్తి చేయడం కోసం ఈ కంపెనీలకు ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది.