హెలికాప్టర్ లో వచ్చి ప్రమాణం చేసిన సర్పంచ్

హెలికాప్టర్ లో వచ్చి ప్రమాణం చేసిన సర్పంచ్

Helicopter In Oath : ఎన్నికలు వచ్చాయంటే..సందడి సందడి అంతా ఇంత ఉండదు. ఓటర్లను ఆకర్షించడానికి అభ్యర్థులు నానా విధాలుగా ప్రయత్నిస్తుంటారు. ప్రచారం నుంచి మొదలు కొని..నామినేషన్ వరకు..ఎన్నికల్లో గెలిచిన తర్వాత..అభ్యర్థుల హడావుడి ఎక్కువగానే ఉంటుంది. టపాసులు పేల్చడం, డీజే పాటలతో హోరెత్తిస్తుంటారు. ఎన్నికల్లో గెలిచిన ఓ వ్యక్తి..ప్రమాణ స్వీకారం చేయడానికి హెలికాప్టర్ లో రావడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ తాలూకాలో ఉన్న అంబి – డుమాలా గ్రామానికి సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. గత నెలలో ఈ ఎన్నికలను నిర్వహించారు. సర్పంచ్ గా పారిశ్రామికవేత్త జలీందర్ గగారే (50) పోటీ చేశారు. అతనితో పాటు..తన 9 మంది సభ్యుల ప్యానెల్ క్లీన్ స్వీప్ చేసింది. వ్యాపార పనులు చూసుకుంటున్న ఇతను ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. పూణేలో ఉంటున్న తన ఇంటి నుంచి నేరుగా ఆ గ్రామానికి వెళ్లడానికి ఏకంగా హెలికాప్టర్ ను బుక్ చేసుకున్నాడు.

హెలికాప్టర్ లో వచ్చిన అతడిని చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఇతడికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. విజయ తిలకం దిద్దిన అనంతరం హెలిప్యాడ్ నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయానికి 12 ఎద్దుల బండ్ల మీద ఊరేగింపుగా తీసుకెళ్లారు. తన స్వగ్రామం..సన్నిహితులతో సంబంధాన్ని తాను తెంచుకోవాలని అనిపించడం లేదని, అందుకే ఎన్నికల్లో పోటీ చేయడం జరిగిందని జలీందర్ వెల్లడించారు. గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు.