శశికళ ఆసక్తికర వ్యాఖ్యలు..100 ఏళ్లు అన్నాడీఎంకే అధికారంలో ఉండాలి

శశికళ ఆసక్తికర వ్యాఖ్యలు..100 ఏళ్లు అన్నాడీఎంకే అధికారంలో ఉండాలి

Sasikala : వందేళ్ల వరకు తమిళనాడులో అన్నాడీఎంకే అధికారంలో ఉండాలనేది జయలలిత ఆకాంక్ష అని శశికళ గుర్తు చేశారు. అందుకోసం ప్రతి ఒక్క అన్నాడీఎంకే కార్యకర్త కృషి చేయాలని… విభేదాలు పక్కన పెట్టాలని సూచించారు. అమ్మ అభిమానులు అంతా చేతులు కలిపి పార్టీ విజయానికి కృషి చేయాలని… రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి శత్రువును ఓడించేలా కష్టపడాలన్నారు. ఇందుకోసం త్వరలోనే పార్టీ నేతలు, కార్యకర్తలను స్వయంగా కలుస్తానంటూ శశికళ వ్యాఖ్యానించారు.

జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే పార్టీలో చీలికలు ఏర్పడ్డాయి. ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం, పళని స్వామి వర్గాలు ఒక్కటయ్యాయి. వీరిద్దరు కలిసి శశికళను పక్కన పెట్టారు. అదే సమయంలో అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల పాటు శశికళ శిక్ష అనుభవించారు. గతనెలలో బెంగళూరు జైలు నుంచి విడుదలైన శశికళ… భారీ ర్యాలీగా అభిమానులతో కలిసి చెన్నై చేరుకున్నారు. అయితే మొదటి నుంచి శశికళను దూరంగా పెట్టిన పీఎస్ వర్గాలు… అన్నాడీఎంకే నుంచి చిన్నమ్మను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

అన్నాడీఎంకే నేతలతో కలిసేందుకు జయలలిత జయంతి కార్యక్రమాన్ని శశికళ కేంద్రంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. జయలలిత విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం… శశికళ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. ఉమ్మడి శత్రువు డీఎంకేను ఓడించేందుకు అమ్మ అభిమానులంతా ఏకం కావాలన్నారు. ఇందుకోసం విభేదాలు పక్కన పెట్టాలని కోరారు. శశికళ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. దీనిపై అన్నాడీఎంకే నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తి రేపుతోంది.