శశికళ వాహనంపై అన్నాడీఎంకే జెండా!

శశికళ వాహనంపై అన్నాడీఎంకే జెండా!

Sasikala’s car : అన్నాడీఎంకే బహిషృత నేత శశికళ బెంగుళూరు విక్టోరియా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా లక్షణాలు కనిపించడంతో విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స అందించారు వైద్యులు. మరలా కరోనా పరీక్ష నిర్వహించగా..నెగటివ్ రావడంతో…ఆసుపత్రి నుంచి 2021, జనవరి 31వ తేదీ ఆదివారం ఉదయం ఆమెను డిశ్చార్జ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, అనుచరులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆసుపత్రి నుంచి ఆమె కారులో బయలుదేరారు.

ఫిబ్రవరి 03న చెన్నైకి : –
ఇదిలా ఉంటే..శశికళ వాహనంపై అన్నాడీఎంకే పార్టీ జెండా ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. పార్టీ నుంచి బహిష్కృతమైనా..కారుపై పార్టీ జెండా ఉండడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి సంబంధించిన నేతలు ఎవరూ..శశికళతో టచ్ లో ఉండొద్దని అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. నేరుగా ఆమె బెంగళూరు వెళుతారని, అక్కడనే కొన్ని రోజులు ఉంటారని సమాచారం. వైద్యుల హోం క్వారంటైన్ సూచన మేరకు బెంగళూరులోనే కొన్ని రోజులు ఉండాలని శశికళ కూడా నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. శశికళ మేనల్లుడు దినకరన్‌ ఇప్పటికే ఒక అపార్ట్‌మెంట్‌ను బెంగళూరులో సిద్ధం చేశారని, అందులో అన్ని సదుపాయాలూ ఉన్నాయని అమ్మ మక్కల్‌ మున్నేట్ర కలగం కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. దీనిని బట్టి చూస్తే ఫిబ్రవరి మొదటివారంలో చెన్నై వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫిబ్రవరి 03వ తేదీన చెన్నైకి వచ్చిన తర్వాత..రాజకీయాలు తదితర అంశాలపై శశికళ స్పందించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

2017లో అక్రమాస్తుల కేసు : –
2017లో అక్రమాస్తుల కేసులో శశికళ అరెస్టు అయ్యారు. బెంగళూరు పరప్పన అగ్రహారం జైలుకు తరలించారు. ఈ కేసులో ఈనెల 27వ తేదీన నాలుగేళ్ల శిక్షకాలాన్ని ఆమె పూర్తి చేసుకున్నారు. దీంతో ఆమెను విడుదల చేశారు. 2016 వరకు అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీగా పని చేశారామె. అప్పడు జరిగిన పరిణామాలతో పదవి నుంచి తొలగించడంతో పాటు..పార్టీ నుంచి బహిష్కరించారు.

జయ మరణం తర్వాత : –
జయలలిత మరణించాక తమిళనాట అధికార అన్నాడీఎంకే విభేదాలు రచ్చకెక్కాయి. పన్నీర్‌సెల్వం ఎదురుతిరగడంతో.. పళనిస్వామిని తెరపైకి తెచ్చారు శశికళ. సీఎం అయ్యాక పళనిస్వామి కూడా ఎదురుతిరగడంతో శశికళ రాజకీయ భవిష్యత్తు అంధకారమైంది. జైలు జీవితం ముగించుకున్న శశికళలో ఈ ఏడాది మేలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా మారాయి. తమిళ రాజకీయాల్లో శశికళ రీ ఎంట్రీ ఉంటుందో లేదోననే చర్చ..కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. నాలుగురోజుల క్రితం జైలు నుంచి విడుదలైన శశికళ ఎలాంటి వ్యూహరచన చేయనున్నారు? ఆమె రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండనున్నాదనేది సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. 63 ఏళ్ల శశికళ క్రియాశీల రాజకీయాల్లో ఎలా నెగ్గుకొస్తారనేది ప్రశ్నార్థకమవుతోంది.

రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయో : –
అన్నిటికీ మించి ఒక కేసులో దోషిగా నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించడంతో.. ప్రత్యక్ష ఎన్నికల్లో నాలుగేళ్ల పాటు పోటీ చేసేందుకు అనర్హురాలుగా పరిగణిస్తారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా…రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ఎక్కువగా ఇష్టపడతారని పొలిటికల్‌ సర్కిళ్లలో ఓ వాదన వినిపిస్తోంది. తాననుకున్నది సాధించే పంతంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీతో జట్టుకడతారని చర్చా జరిగింది. కానీ వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు కొనసాగుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రకటన చేసేశారు. దీంతో.. శశికళ రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయనేదానిపై ఇప్పటికైతే అంతుచిక్కట్లేదు.