ఎస్బీఐ కస్టమర్లకు వార్నింగ్.. మీ అకౌంట్లు ఖాళీ అయ్యే ప్రమాదం

ఎస్బీఐ కస్టమర్లకు వార్నింగ్.. మీ అకౌంట్లు ఖాళీ అయ్యే ప్రమాదం

sbi warns customers: ఇటీవలి కాలంలో ఆన్ లైన్ మోసాలు బాగా పెరిగాయి. సైబర్ నేరగాళ్లు కస్టమర్లకు గాలం వేసి వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు. నిమిషాల్లోనే లోన్ ఇస్తామని చెబుతూ బాధితుల బ్యాంక్ ఖాతాల్లోని డబ్బుని కొట్టేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ త‌ర‌హా మోసాలు దేశంలో పెరిగిపోయాయి. దీంతో దాదాపు అన్ని బ్యాంకులు తమ కస్టమర్లను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉన్నాయి. ఫేక్ మెసేజ్ లు, లింకులు, కాల్స్ తో జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాయి. తాజాగా అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ-SBI) కూడా ఇదే విష‌యంపై త‌న వినియోగ‌దారుల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

కేవ‌లం 5 నిమిషాల్లోనే లోన్ ఇస్తామంటూ కేటుగాళ్లు కాల్స్ చేస్తున్నారు. ఎస్ఎంఎస్‌లు కూడా పంపుతున్నారు. కాల్స్ రిసీవ్ చేసుకున్న‌ వారికి కూడా లోన్ తీసుకోవాల‌ని చెప్పి లింక్‌ను పంపిస్తున్నారు. నిజ‌మే అని న‌మ్మి కొందరు ఆ లింక్‌ల‌ను సంద‌ర్శిస్తున్నారు. అంతే, అలాంటి లింక్‌ల‌పై క్లిక్ చేయ‌గానే నిమిషాల వ్య‌వ‌ధిలోనే వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బు మాయం అవుతోంది.

ఇలా ఎవ‌రైనా కాల్స్ చేసినా, మెసేజ్‌లు పంపినా స్పందించ‌వద్ద‌ని, వాటిల్లో ఉండే లింక్‌ల‌ను క్లిక్ చేయ‌వ‌ద్ద‌ని, చేస్తే బ్యాంకు ఖాతా నిమిషాల్లోనే ఖాళీ అవుతుంద‌ని ఎస్బీఐ హెచ్చ‌రించింది. ఇన్‌స్టంట్ లోన్ పేరిట ఎవ‌రైనా లోన్ ఇస్తామ‌ని చెబితే న‌మ్మ‌కూడ‌ద‌ని తెలిపింది. కేవ‌లం బ్యాంకుల‌కు చెందిన అధికారిక వెబ్‌సైట్ల‌ను సంద‌ర్శించ‌డం ద్వారా లేదా బ్యాంక్ బ్రాంచిని సంప్ర‌దించ‌డం ద్వారా మాత్ర‌మే లోన్ల‌కు అప్లయ్ చేయాల‌ని ఎస్బీఐ సూచించింది.

మన దేశంలో బ్యాంకింగ్ మోసాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఎస్బీఐకి దేశవ్యాప్తంగా 42కోట్లకుపైగా కస్టమర్లు ఉన్నారు. కాబట్టి బాధితుల్లో ఎక్కువగా ఎస్బీఐ కస్టమర్లు ఉంటారనడంలో సందేహం లేదు. అందుకే బ్యాంకు ఎప్పటికప్పుడు తన కస్టమర్లను హెచ్చరిస్తూనే ఉంటుంది.

* సోషల్ మీడియాలో ఎస్బీఐ పేరుతో జరుగుతున్న ప్రచారాలను నమ్మొద్దు

* మిస్ లీడ్ చేసే ఫేక్ మెసేజ్ లు పట్టించుకోవద్దు

* సోషల్ మీడియా లేదా మెయిల్స్, ఎస్ఎంఎస్ లు పంపి లేదా కాల్ చేసి బ్యాంకు ఖాతా వివరాలు అడిగితే అస్సలు చెప్పొద్దు

* బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని నమ్మించినా కార్డు వివరాలు, ఓటీపీ చెప్పొద్దు

* ఏవైనా అప్ డేట్ చేయాలంటే బ్యాంకుకి వెళ్లి వివరాలు ఇవ్వాలి

* సోషల్ మీడియా మాత్రమే కాదు.. ఈమెయిల్స్, మెసేజస్, వాట్సాప్ లో ఎస్బీఐ పేరుతో వచ్చే సందేశాలను పట్టించుకోవద్దు

* ఏ సమాచారం కావాలన్నా అధికారిక ప్లాట్ ఫామ్స్ లో మాత్రమే చూడాలి

* నకిలీ వెబ్ సైట్స్ లేదా ఎస్బీఐ పేరుతో నకిలీ మెయిల్స్, మెసేజస్ వస్తే సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ కు ఫిర్యాదు చేయొచ్చు

* https://cybercrime.gov.in/ వెబ్ సైట్ లో కంప్లైంట్ చేయొచ్చు. వీటిపై బ్యాంకులకు కూడా సమాచారం ఇవ్వొచ్చు

* ఇలాంటి మెయిల్స్, మెసేజస్ కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను epg.cms@sbi.co.in లేదా phishing@sbi.co.in ఇమెయిల్ ఐడీకి మొయిల్ పంపండి.

* కొద్ది రోజుల క్రితం http://www.onlinesbi.digital పేరుతో ఓ వెబ్ సైట్ ఎస్టీఐ కస్టమర్లకు వల వేసిన సంగతి తెలిసిందే

* దీనిపై సమాచారం అందుకున్న ఎస్బీఐ అది నకిలీ వెబ్ సైట్ అని కస్టమర్లను హెచ్చరించింది

ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో దాదాపుగా ప్రతి ఒక్కరికీ లోన్లు అవసరం అయ్యాయి. దీన్ని కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. నిమిషాల్లో లోన్ ఇస్తామని చెప్పి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఈ క్రమంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదంతా డిజిటల్ యుగం. అంతా ఆన్ లైన్ లోనే జరిగిపోతోంది. అదే సమయంలో ఆన్ లైన్ వేదికగా మోసాలు పెరిగిపోయాయి. అంతా డిజిటల్ మయం అని ఆనందించాలో సైబర్ నేరాలు పెరిగిపోయినందుకు చింతించాలో అర్థం కాని పరిస్థితి.