సెక్స్ వర్కర్లకు రేషన్ ఇవ్వండి…రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశం

SC directs-dry ration to sex workers రేషన్ కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రాలను అడగకుండానే సెక్స్ వర్కర్లకు రేషన్ సరుకులను ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇవాళ(సెప్టెంబర్-29,2020) రాష్ట్రాలను ఆదేశించింది. జాతీయ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (నాకో), జిల్లా న్యాయ అధికారులు గుర్తించిన సెక్స్ వర్కర్లందరికీ డ్రై రేషన్ అందించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.
రాష్ట్ర ప్రభుత్వాలేవి తమ తీర్పును ఉల్లఘించొద్దని తమ ఉత్తర్వు అమలు గురించి నాలుగు వారాల్లోగా తెలియజేయాలని ఆదేశించింది. ఎక్కడెక్కడ ఎంతమంది సెక్స్‌వర్కర్లు లబ్దిపొందారో తెలపాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
కరోనా సమయంలో దేశవ్యాప్తంగా సెక్స్ వర్కర్లు ఎదుర్కొంటున్న కష్టాలపై ఎన్జీఓ దర్బార్ మహిళా సమన్వయ కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ఫై జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ అజయ్ రాస్తోగిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. గుర్తింపు రుజువులు లేకపోవడం వల్ల సెక్స్ వర్కర్లు రేషన్, నగదు బదిలీ, ఇతర సదుపాయాలను పొందడం లేదని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
గుర్తింపు పత్రాల కోసం పట్టుబట్టకుండా రాష్ట్రాలు సెక్స్‌వర్కర్లకు సౌకర్యాలు కల్పిస్తే కేంద్రానికి అభ్యంతరం లేదని అదనపు సొలిసిటర్ జనరల్ ఆర్.ఎస్. సూరి తెలిపారు. ఇప్పటికే ఆ దిశగా చర్యలు తీసుకున్నట్లు మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ కౌన్సిల్స్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.