మహరాష్ట్ర సర్కార్‌కు సుప్రీం ఆర్డర్ : ఆరే కాలనీలో చెట్లను తొలగించొద్దు

  • Published By: madhu ,Published On : October 7, 2019 / 05:36 AM IST
మహరాష్ట్ర సర్కార్‌కు సుప్రీం ఆర్డర్ : ఆరే కాలనీలో చెట్లను తొలగించొద్దు

ముంబైలోని ఆరే కాలనీలో చెట్లను నరికివేయడంపై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. యథాతథస్థితిని కొనసాగించాలని, చెట్లను నరికివేయవద్దని సూచించింది మహారాష్ట్ర ప్రభుత్వానికి. చెట్లను నరికివేయవద్దంటూ…పోరాటం చేసి అరెస్టు అయిన వారిని విడుదల చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణనను అక్టోబర్ 21కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. న్యాయ విద్యార్థులు రాసిన లేఖను సుమోటోగా సుప్రీం తీసుకుని విచారించింది. మెట్రో కారు పార్కింగ్ షెడ్ నిర్మాణం కోసం చెట్లను నరికివేయడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. తదుపరి విచారణ అక్టోబర్ 21న పర్యావరణ ధర్మాసనం చేపడుతుందని వెల్లడించింది. 

ముంబైలో మెట్రో రైలు ప్రాజెక్టు మూడో ఫేజ్ కోసం ఆరే కాలనీలో 2 వేల 185 చెట్లను నరికివేస్తున్న అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. చెట్లను తొలగించవద్దంటూ ఆందోళనకారులు, పర్యావరణ వేత్తలు ఆందోళన చేపట్టారు. సుప్రీంకోర్టు తలుపు తట్టారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌కి లేఖ రాశారు. దీంతో దీనిని పరిశీలించేందుకు ద్విసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. అక్టోబర్ 07వ తేదీ సోమవారం ప్రత్యేక ధర్మాసనం విచారించింది. ఇది ఇలా కొనసాగుతుండగానే..శుక్రవారం రాత్రి ముంబై పోలీసులు అరెస్టు చేసిన 29 మంది ఆందోళనకారులకు షరతులతో కూడిన బెయిల్ లభించింది. 

ఈ అంశంపై ముంబై హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. చెట్ల నరికివేతను ఆపాలంటూ పర్యావరణ వేత్తలు వేసిన పిల్‌పై అత్యవసరంగా విచారణ జరిపేందుకు కోర్టు నిరాకరించింది. ఇప్పటికే 15 వందలకు పైగా చెట్లను నరికివేసినట్లు తెలుస్తోంది. 

ఆరే కాలనీ అంటే…
ఈ కాలనీ పేరు ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ముంబై అంటేనే ఇరుకు నగరంగా పేరొందింది. ఆరే కాలనీ అనేది గ్రీన్ బెల్ట్. ఇక్కడ ఏకంగా 5 లక్షలకు పైగానే చెట్లు ఉన్నాయని అంచనా. ముంబైలోని కాలుష్యం తగ్గించడంలో ఈ చెట్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కానీ ముంబై మెట్రో రైలు ప్రాజెక్టు మూడో ఫేజ్ నిమిత్తం చెట్లను నరివేయాలనే దానిపై తీవ్ర వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది. కాలుష్యాన్ని అరికడుతున్న ఈ చెట్లను నరికివేయద్దంటున్నారు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆందోళనకారులు, పర్యావరణ వేత్తలు.
Read More : వన్యమృగ పార్కులో విషాదం : సరస్సులో పడి ఆరు ఏనుగులు