ఎమ్మెల్యే, ఎంపీలపై పాతకేసు 1983 నుంచి పెండింగ్‌లో ఉందా? షాకైన సుప్రీంకోర్టు

  • Published By: vamsi ,Published On : September 11, 2020 / 09:14 AM IST
ఎమ్మెల్యే, ఎంపీలపై పాతకేసు 1983 నుంచి పెండింగ్‌లో ఉందా? షాకైన సుప్రీంకోర్టు

పంజాబ్‌లో పెండింగ్‌లో ఉన్న ఓ క్రిమినల్ కేసు 1983 నాటిదని తెలిసి సుప్రీంకోర్టు షాక్ అయ్యింది. గత 36 సంవత్సరాలుగా జీవిత ఖైదు కేసు ఎందుకు పెండింగ్‌లో ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా దోషులకు జీవిత నిషేధం విధించడం గురించి కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం కోరింది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన వారిపై జీవిత నిషేధం విధించాలని పిల్ డిమాండ్ చేయగా.. విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు.

క్రిమినల్‌ కేసులతో పాటు అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్‌ నిరోధక చట్టం, ఎక్సైజ్‌ చట్టం, కస్టమ్స్‌ చట్టం, జీఎస్టీ చట్టం, కంపెనీల చట్టం వంటి ప్రత్యేక చట్టాలకు సంబంధించి కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలపై పెండింగ్‌లో ఉన్న అన్ని కేసుల గురించి పూర్తి సమాచారాన్ని సమర్పించాలని సుప్రీంకోర్టు హైకోర్టులకు ఆదేశాలు జారీ చేయగా.. క్రిమినల్ కేసుల వివరాలను దేశంలోని అన్ని హైకోర్టులు సుప్రీంకోర్టుకు సమర్పించాయి.



ఈ సంధర్భంగా పంజాబ్‌లోని ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో ఉన్న పురాతన క్రిమినల్ కేసుల్లో ఒకటి 1983 నాటిదని తెలిసిన తరువాత, సుప్రీంకోర్టు షాక్‌ అయ్యింది. జస్టిస్‌ ఎన్‌వి రమణ, సూర్య కాంత్‌, హృషికేశ్‌ రాయ్‌లతో కూడిన ధర్మాసనం.. అమికస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది విజయ్ హన్సరియా సుప్రీంకోర్టు మార్చి 5 న ఇచ్చిన ఉత్తర్వులను ఉటంకిస్తూ, పెండింగ్‌లో ఉన్న కేసుల ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించి నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు.
https://10tv.in/final-year-exams-to-be-held-says-supreme-court/
క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన వారిపై జీవితకాల నిషేధం విధించాలనే ఆలోచనను సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. ఈ కేసులు పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున మాత్రమే ప్రత్యేక కోర్టులు ఉన్నాయని, కోర్టుల సంఖ్యను పెంచితే త్వరగా పరిష్కారం అవుతాయని అభిప్రాయపడ్డారు. 4,442 కేసులకు దేశవ్యాప్తంగా 12 ప్రత్యేక కోర్టులు మాత్రమే ఉన్నాయని, 65 కేసులు దాటిన రాష్ట్రానికే ప్రత్యేక కోర్టులు ఇచ్చారని న్యాయమూర్తుల దృష్టికి రాగా, కోర్టుల సంఖ్యను పెంచాలని కోర్టు అభిప్రాయపడింది.