INS విరాట్ ను ముక్కలు చేయడంపై సుప్రీం స్టే

INS విరాట్ ను ముక్కలు చేయడంపై సుప్రీం స్టే

INS Virat భారత నౌకాదళంలో మూడు దశాబ్దాలకుపైగా సేవలందించిన ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియ‌ర్ ఐఎన్​ఎస్​ విరాట్​ నౌకను తుక్కుగా మార్చాలన్న కేంద్రం నిర్ణయంపై సుప్రీం కోర్టు స్టే విధించింది. దీనిని ముక్క‌లు చేయ‌డానికి ప్ర‌భుత్వం నుంచి కొనుగోలు చేసిన సంస్థ య‌జ‌మానికి ఈ మేర‌కు నోటీసులు కూడా జారీ చేసింది.

ఐఎన్ఎస్ విరాట్‌ను ముక్క‌లు చేయ‌కుండా దానిని ఓ మ్యూజియంగా మార్చాలంటూ ఓ సంస్థ దాఖలు చేసిన పిటిషన్​పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డె నేతృత్వంలోని ధర్మాసం విచారణ చేపట్టింది. మ్యూజియంగా మార్చాలని దాఖలైన పిటిషన్ ​పై అభిప్రాయం చెప్పాలని ఆదేశిస్తూ కేంద్రంతో పాటు సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది ధర్మాసనం. ప్రస్తుతం యథాతథ స్థితిని కొనసాగించాలని కోర్టు ఆదేశించింది.

దేశానికి అత్య‌ధిక కాలం సేవ‌లందించిన యుద్ధ‌నౌక‌గా ఐఎన్ఎస్ విరాట్‌కు గుర్తింపు ఉంది. ఐఎన్‌ఎస్‌ విరాట్‌ తొలుత బ్రిటన్ కు చెందిన రాయల్‌ నేవీలో హెచ్‌ఎంఎస్‌ హెర్మిస్‌గా సేవలందించింది. 1986లో ఇండియ‌న్ నేవీ దీనిని కొనుగోలు చేసి ఐఎన్ఎస్ విరాట్‌గా దీని పేరు మార్చింది. భారత నావిక దళంలోని 30 ఏళ్ల పాటు సేవలందించిన ఈ నౌక‌ జీవితకాలం 3ఏళ్ల కింద పూర్తయ్యింది. దీంతో 2017 మార్చిలో నౌకాదళం నుంచి దీనిని ఉపసంహరించారు అధికారులు. అప్పటి నుంచి ముంబై తీరంలో ఉంది. మొదట దీనిని మ్యూజియంగా కానీ రెస్టారెంట్‌గా గానీ మార్చేందుకు ప్రయత్నించారు. కానీ, ఆ ప్రణాళికలు ఫలించలేదు. దీంతో తుక్కుగా మార్చి అమ్మాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

అయితే ఈ యుద్ధ‌నౌక‌ను మ్యూజియంగా మార్చి.. గోవాలోని జువారీ న‌దిలో ఉంచేందుకు ముంబైకి చెందిన ఎన్విటెక్ మ‌రైన్ క‌న్స‌ల్టెంట్స్ ముందుకు వ‌చ్చింది. గోవా ప్ర‌భుత్వం కూడా వీళ్లతో చేతులు క‌లిపి ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకుపోవాల‌న్న ఉద్దేశంతో ర‌క్ష‌ణ శాఖ‌కు లేఖ కూడా రాసింది. ఈ మ్యూజియం ప్రాజెక్ట్ కోసం మ‌హారాష్ట్ర‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాలు కూడా ముందుకు వ‌చ్చాయి.