11ఏళ్ల విద్యార్థినిపై స్కూల్‌లోనే పలుమార్లు అత్యాచారం, కీచక ప్రిన్సిపల్‌కు మరణ శిక్ష

11ఏళ్ల విద్యార్థినిపై స్కూల్‌లోనే పలుమార్లు అత్యాచారం, కీచక ప్రిన్సిపల్‌కు మరణ శిక్ష

School Principal death penalty student Rape: గురువంటే దైవంతో సమానం. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారు సన్మార్గంలో వెళ్లేలా చూసేది గురువే. అందుకే.. ఉపాధ్యాయుడు అన్నా, ఉపాధ్యాయ వృత్తి అన్నా ఎంతో గౌరవం ఇస్తారు. దైవంతో సమానంగా చూస్తారు. కానీ, కొందరు టీచర్లు కీచకుల్లా మారుతున్నారు. పవిత్రమైన వృత్తికి కళంకం తెస్తున్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొందరు గురువులు, కామంతో కళ్లు మూసుకుపోయి దారుణాలకు ఒడిగడుతున్నారు. మార్కుల పేరుతో, మాయ మాటలతో విద్యార్థులను లొంగదీసుకుని అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. తమ కామవాంచ తీర్చుకుంటున్నారు.

5వ తరగతి చదివే 11ఏళ్ల విద్యార్థినిని స్కూల్ లోనే పలుమార్లు అత్యాచారం చేసి గర్భానికి కారణమైన ఓ స్కూల్ ప్రిన్సిపల్‌కు పట్నాలోని ప్రత్యేక పోక్సో కోర్టు మరణ శిక్ష విధించింది. రూ.లక్ష జరిమానా కూడా కట్టాలని ఆదేశించింది. ఈ అకృత్యంలో అతడికి సహకరించిన మరో నిందితుడికి యావజ్జీవ జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధించింది. బాధితురాలికి బిహార్‌లోని బాధితుల పరిహార పథకం కింద రూ.15 లక్షలు అందజేయాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం(ఫిబ్రవరి 16,2021) ఈ తీర్పు వెలువరించింది.

ఈ ఘటన 2018 సెప్టెంబర్ లో జరిగింది. పట్నాలోని ఫుల్వారి షరీఫ్‌ ప్రాంతంలో ఉండే స్కూల్ యజమాని రాజ్‌ సింఘానియా అలియాస్‌ అర్వింద్‌ ప్రిన్సిపల్‌గానూ వ్యవహరించేవాడు. కాగా, బడిలో చదివే 11 ఏళ్ల విద్యార్థినిపై అతడి కన్ను పడింది. కామంతో అతడి కళ్లు మూసుకుపోయాయి. అభిషేక్‌ కుమార్‌ అనే సహాయకుడి ద్వారా విద్యార్థినిని తన క్యాబిన్‌కు రప్పించుకుని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ కీచక పర్వాన్ని కొన్ని రోజుల పాటు కొనసాగించాడు. అంతేకాదు ఆ దారుణాన్ని వీడియో తీసి ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు.

కొన్ని రోజులకు బాలిక అనారోగ్యానికి గురైంది. కంగారుపడిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా గర్భిణి అన్న విషయం బయటపడింది. దీంతో వారు షాక్ తిన్నారు. బాలికను గట్టిగా నిలదీశారు. దాంతో తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాలిక.. తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికకు గర్భస్రావం చేయించారు.

రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. నిందితుడు అర్వింద్‌కు డీఎన్‌ఏ పరీక్షలు చేయడంతో నేరం రుజువైంది. అప్పట్నుంచి అతడు జైల్లో ఉంటున్నాడు. సాక్ష్యాధారాలను రూపుమాపడానికి అర్వింద్‌ స్కూల్ ని తగలబెట్టించారని, అయితే సకాలంలో పోలీసులు అక్కడకు చేరుకుని నష్టాన్ని నివారించారని విచారణాధికారి కోర్టుకు తెలిపారు. ఈ కేసును అత్యంత అరుదైనదిగా పేర్కొన్న న్యాయమూర్తి అవదేశ్‌ కుమార్‌ నిందితుడు అర్వింద్‌ ఘోరమైన నేరానికి పాల్పడ్డాడని చెబుతూ మరణ దండన విధించారు.