ఎక్కడో తెలుసా : సముద్ర ‘నురగ’ వినాయకుడి దేవాలయం 

  • Published By: veegamteam ,Published On : August 29, 2019 / 09:56 AM IST
ఎక్కడో తెలుసా : సముద్ర ‘నురగ’ వినాయకుడి దేవాలయం 

అన్నింటా ఇమిడిపోతాడు గణపయ్య. వినాయకచవితికి గణనాథులను విభిన్నరకాలుగా తయారు చేస్తుంటారు. స్వీట్స్ తో, కూరగాయలు, పూలు,పండ్లు,  చెరుకుగడలు,రుద్రాక్షలు,నాణాలు, డబ్బులు ఇలా ఒకటేమిటి…లంబోదరుడు విగ్రహాలను తయారు చేస్తుంటారు. కానీ మట్టితో పూజించే వినాయకుడే మనిషికీ, మానవాళికి శ్రేష్ఠం. పర్యావరణ పరిరక్షకు మట్టి వినాయకుడే మంచి అని ఇప్పుడు అంతా నెత్తీ నోరు కొట్టుకుంటున్నారు.కానీ..అటువంటి పర్యారణం నుంచి ఉద్భవించిన అరుదైన..విశేష వినాయకుడి గురించి చాలా మంది విని వుండరు కూడా. ఆ గణపయ్య దేనీతో రూపు దిద్దుకున్నాడో తెలుసా..‘సముద్ర నురగ’తో  తయారైన వినాయకుడి గుడి విశేషాలు ఈ వినాయక చవితి సందర్భంగా తెలుసుకుందాం. 

సముద్ర ‘నురగ’తో వినాయకుడు వినటానికి నమ్మశక్యంగా లేదు కదూ. ఇది ఎన్నో వేల ఏళ్ళనుంచి వస్తున్న పురాణగాధ. తరాలనుంచీ భక్తులు నమ్మి కొలిచిన దైవ చరిత్ర. సముద్ర ‘నురగ’ వినాయకుడు తమిళనాడులో కొలువై ఉన్నాడు. కుంభకోణానికి 6 కి.మీ. ల దూరం ఉంది. తంజావూర్ జిల్లా, కుంభకోణం తాలూకాలోని ఒక గ్రామం ‘తిరువలన్ చుహి’. తన తల్లి తండ్రులతో సహా కొలువు తీరాడు పాల సముద్ర నురగతో తయారు చేయబడిన శ్వేత వినాయకుడు.  వైట్ వినాయగర్ కోవెల అంటారు. చిన్నగా ఉండే ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది.

అసలు సముద్ర నురుగ నుంచి వినాయకుడు ఎలా ఆవిర్భించాడు అనేదానికి ఒక కథ ఉంది. దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని మధించిన కధ గురించి అందరికీ తెలుసు. ఏ పూజకైనా..కార్యక్రమానికైనా వినాయకుడి పూజతో ప్రారంభం అవుతుందనే సంగతి తెలిసిందే. కానీ పాల సముద్రాన్ని మధించే మహత్తర కార్యక్రమానికి మాత్రం వినాయక పూజని చేయటం దేవతలు మరిచి పోయారట.  అందుకే సముద్ర మధనంలో ముందు హాలాహలం (కాలకూట విషం. దీన్ని శివుడు తన కంఠంలో బంధించాడు) పుట్టిందిట. దీంతో దేవతలంతా శివుడిని వేడుకున్నారు. తమ పొరపాటు తెలుసుకున్నాం..వినాయకుడ్ని పూజిస్తాం అని లెంపలు వేసుకున్నారు. తరువాత పాల సముద్రం నుంచి పుట్టిన నురగతో వినాయకుణ్ణి తయారు చేసి, పూజించారుట. ఆ తర్వాత లక్ష్మీదేవి..కామధేనువుతో పాటు అమృతభాండం పుట్టింది. దాని కోసం దేవతలు…రాక్షసులు కొట్లాట అంతా ఓ పేద్ద కథ. ఇదిలా ఉంటే మన శ్వేత వినాయకుడు గురించి చూద్దాం.. 

ఇంద్రుడు అహల్య కథ తదిత ఘటనలతో శాపాన్ని పోగొట్టుకోవటానికి ఈ శ్వేత వినాయకుడిని పట్టుకుని శివార్చన చేస్తూ ఎన్నో  ప్రదేశాలు తిరుగుతూ  ఇక్కడికి వచ్చాడుట. నురగ వినాయకుడికి  ‘తిరువలన్ చుహి’లో ఉండిపోవాలనుకున్నాడు. దానికి తండ్రిని సహాయం అడిగాడు. దీంతో శివుడు చిన్నపిల్లాడి రూపంలో ఇంద్రుడి దగ్గరకు వచ్చాడుట. ఇంద్రుడు శ్వేత వినాయకుణ్ణి ఆ బాలుడి చేతికిచ్చి తాను శివార్చన ముగించుకు వచ్చేదాకా కింద పెట్టవద్దని చెప్పి మరీ వెళ్ళాడు.  బాలుడి రూపంలో ఉన్న శివుడు శ్వేత వినాయకుణ్ణి అక్కడ వున్న బలిపీఠం కింద పెట్టి వెళ్ళి పోయాడుట.  తిరిగి వచ్చిన ఇంద్రుడు శ్వేత వినాయకుణ్ణి అక్కడనుంచి తీసుకెళ్ళాలని వివ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ సాధ్యం కాలేదు. 

దేవ శిల్పిని రప్పించి రధం తయారు చేయించి..ఏకంగా శ్వేత  వినాయక విగ్రహం వున్న ఆ ప్రదేశాన్నే తీసుకు వెళ్ళేందుకు యత్నించాడు.  ఆ సమయంలో  శ్వేత వినాయకుడు అశరీరవాణి ద్వారా నేను ఇక్కడే కొలువుదీరాలనుకున్నాననీ..ప్రతి వినాయక చవితికీ వచ్చి శ్వేత విగ్రహాన్ని పూజించమని తెలిపాడు. అలాచేస్తే రోజు గణపతిని పూజించిన ఫలితం వస్తుందని చెప్పింది అశరీరవాణి.  అందుకే ప్రతి వినాయక చవితికి ఇంద్రుడు ఇక్కడికి వచ్చి వినాయకుణ్ణి పూజిస్తాడని భక్తుల నమ్మకం.

శ్వేత వినాయకుడిది చిన్న విగ్రహమే.  ఈ వినాయకుడి విగ్రహం సముద్ర నురగతో తయారుకాబడటంతో ఈ విగ్రహానికి వస్త్రాలు కట్టరు, పూలు పెట్టరు, అభిషేకాలు వంటి క్రతువులు చేయరు. అస్సలు విగ్రహాన్ని పూజారులు కూడా  తాకరు.  కేవలం పచ్చ కర్పూరం పొడి మాత్రం చల్లుతారు, అదీ కూడా చెయ్యి తగలకుండా.

వినాయకుడు ఇక్కడ ఇంద్రదేవి కమలాంబాల్ (మహా విష్ణువు కళ్ళనుంచి పుట్టింది), బుధ్ధి దేవి (బ్రహ్మ వాక్కునుంచి పుట్టింది) అనే వారిని వివాహం చేసుకున్నాడుట.   అందుకే ఇక్కడ ఈ స్వామిని సేవిస్తే వివాహ విషయాలలో వున్న అడ్డంకులు తొలగి పోతాయని భక్తుల నమ్మకం.