Covid Second Wave : కరోనా సెకండ్ వేవ్ పై కేంద్రం హెచ్చరిక

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ పై కేంద్రం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదని చెప్పింది. కరోనా ముప్పు తొలిగిపోలేదని.. దేశంలో ప్రధానంగా ఆరు రాష్ట్రాల్లో చాలా కేసులు నమోదవుతున్నాయని తెలిపింది.

Covid Second Wave : కరోనా సెకండ్ వేవ్ పై కేంద్రం హెచ్చరిక

Covid Second Wave

Covid Second Wave : దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ పై కేంద్రం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదని చెప్పింది. కరోనా ముప్పు తొలిగిపోలేదని.. దేశంలో ప్రధానంగా ఆరు రాష్ట్రాల్లో చాలా కేసులు నమోదవుతున్నాయని తెలిపింది. కేరళ, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్‌, త్రిపుర, చత్తీస్‌ఘడ్‌, మణిపూర్‌లో కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఆరు రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉందని కేంద్రం వివరించింది.

”కరోనా సెకండ్ వేవ్ ముప్పు ఇంకా తొలగలేదు. జూన్ 23-29 మధ్యలో దేశవ్యాప్తంగా 71 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10శాతానికిపైగా ఉంది. అందువల్ల సెకండ్ వేవ్ ముప్పు ముగిసినట్లు భావించొద్దు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యం చేయకూడదు. కరోనా నిబంధనలు పాటించాడం, వేగంగా వ్యాక్సిన్ల పంపిణీతోనే మహమ్మారి నుంచి బయటపడగలం” అని కేంద్రం వివరించింది.

”ప్రస్తుతం దేశంలో కరోనా కొత్త కేసుల్లో 86శాతం తగ్గుదల ఉంది. అయినా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మే 3న 81.1శాతంగా ఉన్న రికవరీ రేటు ప్రస్తుతం 97శాతంగా ఉంది. ఇది ఊరటనిచ్చే అంశమే అయినప్పటికి నిర్లక్ష్యం తగదు. జూన్ 30 నాటికి 12 రాష్ట్రాల్లో 53 డెల్టా ప్లస్ కేసులు గుర్తించాము” అని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరం చేశామని, జూన్ 21 నుంచి రోజుకు యావరేజ్ గా 50లక్షల మంది వ్యాక్సిన్లు ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఇది నార్వే మొత్తం జనాభాకు సమానం అని చెప్పింది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైనప్పటి(జనవరి 16,2021) నుంచి ఇప్పటివరకు 34కోట్ల మందికి(అమెరికా జనాభాకు సమానం) కనీసం ఒక డోసు వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. సుమారుగా 80శాతం మంది హెల్త్ కేర్ వర్కర్లకు, 90శాతం మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు రెండు డోసులు వ్యాక్సిన్లు ఇచ్చినట్టు కేంద్రం తెలిపింది.

మరోవైపు నిన్న ఒక్కరోజే దేశంలో కొత్తగా 46వేల 617 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,04,58,251కి చేరింది. గురువారం కోవిడ్‌తో 853 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,00,312కు పెరిగింది. ఒక్కరోజులో 59వేల 384 మంది కోలుకోగా.. మొత్తం రికవరీలు 2,95,48,302 దాటింది. ప్రస్తుతం 5,09,637 లక్షల యాక్టివ్‌ కేసులున్నాయి.