మరో 3 నెలల్లో కరోనా విజృంభించే అవకాశం.. బీ అలర్ట్

మరో 3 నెలల్లో కరోనా విజృంభించే అవకాశం.. బీ అలర్ట్

Covid ప్రభావం ఉండటం లేదు. ముందు పాటించినంత జాగ్రత్తలు అవసర్లేదు. అసలు ఆ మహమ్మారి గురించి భయమే ఉండక్కర్లేదు అనుకుంటే మన జీవితాలకు మనమే ముప్పు కొనితెచ్చుకున్నట్లు.. ఎందుకంటే ఇలా ఫీలయ్యే విదేశాల్లో కరోనా రెండో దశ మొదలైంది. ఇండియాలోనూ ఢిల్లీ, కేరళలు దీన్ని ఫేస్ చేస్తున్నారు.

పరిస్థితి చక్కదిద్దుకుంటుంది అనుకున్న తర్వాత.. కొత్త కేసులు పెరగటం, ఐసీయూ వార్డులు నిండిపోవటం వంటివి ఆందోళన కలిగిస్తున్నాయి. పలు దేశాలు, ప్రముఖ పట్టణాల్లో వైరస్‌ కట్టడి కోసం మరోసారి లాక్‌డౌన్లు విధించాల్సిన పరిస్థితి దాపరిస్తుంది. స్పెయిన్‌లో 14 ఏళ్లలోపు వాళ్లను ఇంటికే పరిమితం చేస్తుండగా, ఇటలీలో సరైన కారణం ఉంటేనే బయట అడుగుపెట్టేందుకు ప్రజలకు అనుమతి ఇస్తున్నారు.



ఫ్రాన్స్‌లో గంట సేపు మాత్రమే బయట ఉండటం, కిలోమీటర్‌ లోపు తిరిగేందుకు మాత్రమే అనుమతులు వస్తున్నాయి. యూరప్‌ ఎదుర్కొంటున్న పరిస్థితులతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. అమెరికా ప్రభుత్వం కూడా మరోసారి లాక్‌డౌన్‌ విధించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజు సగటున 50వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. బ్రెజిల్‌లోనూ ఇలాంటి పరిస్థితులే కనిపిస్తుండగా, మన దేశంలోనూ వేవ్‌ ప్రారంభమైనట్లు నిపుణులు చెబుతున్నారు.

పండుగల సమయంలో మరింత జాగ్రత్త:
కరోనా ప్రారంభ దశలో పక్కింటి వాళ్లతో కూడా ముచ్చట్లు బంద్ పెట్టిన వారంతా.. జాగ్రత్తలను కాస్త పెడచెవిన పెడుతున్నారు. తెలుగురాష్ట్రాల్లో మరో మూడు నెలల్లో బతుకమ్మ, దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి పండుగలు రానున్నాయి. ఈ సందర్భంగా కరోనా జాగ్రత్తలను నిర్లక్ష్యం చేసి యథేచ్ఛగా వ్యవహరిస్తే ఇక అంతే. అసలే చలికాలం. ప్రతి చిన్న వ్యాధిని బయటపడేసే సీజన్. ఇటువంటి సమయంలో మాస్కులు లేకుండా, ఫిజికల్ డిస్టెన్స్ పట్టించుకోకుండా తిరిగితే ఖతం.

ఢిల్లీ, కేరళలో పెరుగుతున్న కేసులు
ఇండియాలో కరోనా సెకండ్‌ వేవ్‌ తొలిసారిగా ఢిల్లీని తాకింది. జూలై, ఆగస్టు మధ్య కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గినట్టు కనిపించినా, గతంలో కంటే ఎక్కువగా సెప్టెంబర్‌లో కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 12న అత్యధికంగా లక్ష కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కేరళలో ఓనం పండుగ తర్వాత అక్కడ కొత్త కేసుల సంఖ్య ఎక్కువైనట్లు తెలుస్తుంది. కరోనా కాస్త తగ్గుముఖం పట్టగానే ప్రజలు నిర్లక్ష్యంగా ఉండటంతో వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైంది. శనివారం ఒక్కరోజే కేరళలో 9వేల 16, ఢిల్లీలో 3వేల 428 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.