కరోనా కాటేయకుండా…నాగ్ పూర్ లో 144సెక్షన్

కరోనా కాటేయకుండా…నాగ్ పూర్ లో 144సెక్షన్

చాపకింద నీరులా దేశంలో కరోనా(COVID-19) పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒక్క ముంబైలోనే 14 మందికి ఈ మహమ్మారి సోకగా, రాష్ట్రవ్యాప్తంగా 39 మంది ఈ వైరస్ బారినపడ్డారు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన నాగపూర్ మరో అడుగు ముందుకు వేసింది. 

కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా నాగ్‌ పూర్‌లో 144 సెక్షన్‌ ను విధిస్తూ నాగ్ పూర్ పోలీస్ జాయింట్ కమిషనర్ రవీంద్ర కందం ఆదేశాలు జారీ చేశారు. ర్యాలీలు, నిరసన ప్రదర్శనలకు అనుమతి లేదని ఆయన తెలిపారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆంక్షలను అమలు చేస్తున్నట్లు నాగ్‌పూర్‌ జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ రవీంద్ర కుదం తన ఉత్తర్వుల్లో తెలిపారు. అన్ని రాజకీయ, సామూహిక, సాంస్కృతిక, మతసంబంధ, క్రీడలు, వ్యాపార ప్రదర్శనలు, క్యాంపులు, పర్యాటకం, సమావేశాలు, ర్యాలీలు, నిరసనలు వంటి ఇతర కార్యక్రమాలపై ఆంక్షలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. 

 మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ.. ఏ పట్టణాన్ని పూర్తిగా నిర్బంధించే ఉంచే ఉద్దేశం తమకు లేదన్నారు. అయితే, ప్రతి ఒక్కరు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలకు గుంపుగా వెళ్లొద్దన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టే విషయంలో వచ్చే 20 రోజులు ఎంతో కీలకమని, ఈ విషయంలో ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంక్షలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తామన్నారు. మరోవైపు ముంబైలోని ప్రముఖ సిద్ధి వినాయకుడి ఆలయం ను కూడా కరోనా దృష్ట్యా మూసివేశారు.