Republic Day: గణతంత్ర దినోత్సవం వేళ బీహార్ లో హై అలెర్ట్

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీహార్ రాష్ట్రంలో వేడుకలకు విఘాతం కలిగించేందుకు కొందరు కుట్రపన్నారన్న సమాచారంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది

Republic Day: గణతంత్ర దినోత్సవం వేళ బీహార్ లో హై అలెర్ట్

Bihar Police

Republic Day: భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీహార్ రాష్ట్రంలో వేడుకలకు విఘాతం కలిగించేందుకు కొందరు కుట్రపన్నారన్న సమాచారంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలంటూ రాష్ట్ర హోంశాఖ ఆయా జిల్లాలా ఎస్పీలకు ఆదేశాలు జారీచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించింది. బీహార్ లో నక్సల్స్, ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న నిఘావర్గాల హెచ్చరికల మేరకు..అన్ని జిల్లా కేంద్రాలు, ప్రభుత్వ పరిపాలన కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. నక్సల్స్ ప్రభావిత గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు ఇతర రద్దీ ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరింపజేశారు.

Also read: Corona Update: భారత్ లో 3,06,064 కొత్త కరోనా కేసులు నమోదు

మరోవైపు బీహార్ రాష్ట్ర ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో రైల్వేశాఖ కూడా అప్రమత్తం అయింది. ఇప్పటికే ప్రధాన రైల్వే స్టేషన్లలో పార్సెల్ సర్వీస్ బుకింగ్ లను నిలిపివేసిన రైల్వే అధికారులు.. జనవరి 26 వరకు అన్ని రైల్వే స్టేషన్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి బీహార్ కు చేరుకునే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు.

Also read: Viral Video: రెండు రైళ్ల మధ్య పరిగెత్తిన గుర్రం అందులో ఒక జీవిత సత్యం

నేపాల్ – బీహార్ సరిహద్దు వద్ద నిఘాను పెంచిన అధికారులు..నేపాల్ నుంచి వచ్చే అన్ని రహదారులను దిగ్బంధించారు. ప్రతి ఒక్క వాహనాన్ని తనిఖీ చేసిన తరువాతే అనుమతించనున్నారు. ఉగ్రదాడుల హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన బీహార్ పోలీస్ యంత్రాంగం..హోటళ్లు, లాడ్జిలు, ధర్మసత్రాలు, ఇతర పర్యాటక గృహాలలోని పర్యాటకుల వివరాలు సేకరిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే వెంటనే స్థానిక పోలీసులను అప్రమత్తం చేయాలని రాష్ట్ర ప్రజలకు సూచించారు.

Also read: Karnataka Farmer: రైతుని అవమానించిన కార్ షో రూమ్ సేల్స్ మ్యాన్, ఆతరువాత అద్దిరిపోయే సీన్