బుల్ పరుగులు.. ఇన్వెస్టర్ల సంపద రూ. 200 లక్షల కోట్లు

10TV Telugu News

sensex : ఒకటి కాదు.. రెండు కాదు.. 200 లక్షల కోట్లు.. బుల్‌ నాన్‌స్టాప్‌ పరుగులతో చేకూరిన సంపద ఇది.. స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేసిన ఇన్వెస్టర్ల సంపద ఇప్పుడు ఆకాశాన్నంటింది. దలాల్‌ స్ట్రీట్‌ రికార్డ్‌లకు కేరాఫ్‌గా మారింది.. బడ్జెట్‌ కారణంగా ప్రారంభమైన బుల్‌ పరుగులు.. ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ తర్వాత అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో పుంజుకుంది. లాభాల్లోకి మళ్లింది. 50వేల 5వందల మార్క్‌ను దాటింది. మార్కెట్ల దూకుడుతో చరిత్రలో మొదటి సారి మార్కెట్‌ క్యాపిటల్‌ ఫండ్‌ 200 లక్షల కోట్లను దాటింది. మార్కెట్లు వరుస లాభాల్లో కొనసాగుతుండగా… ఇన్వెస్టర్ల సంపద అమాంతం పెరుగుతూ వస్తోంది.

మరోవైపు సెన్సెక్స్‌, నిఫ్టీలు ఆల్‌టైమ్‌ హైకు చేరుకున్నాయి… సెన్సెక్స్ ఏకంగా 50 వేల 614, నిఫ్టీ 14 వేల 900 పాయింట్ల వద్ద ముగిశాయి. మార్కెట్లు జీవితకాల గరిష్ఠాలను చేరేకొద్ది ఇన్వెస్టర్ల సంపద కూడా ఆల్‌ టైమ్‌ హైకు పెరిగిపోయింది.. BSE లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటల్‌ 200 లక్షల కోట్లను దాటేసింది. బుధవారం ఈ సంపద 198.3 లక్షల కోట్లుగా ఉంది. మరోవైపు పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత సెన్సెక్స్ గత నాలుగు సెషన్లలో 4 వేల 3 వందల పాయింట్లకు పైగా పెరిగింది. పెట్టుబడిదారుల సంపద 14 లక్షల కోట్లకు పైగా పెరిగింది.

మార్కెట్లు ఇదే జోష్‌లో కనక పరిగెడితే.. రెండేళ్లలో 5 ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌ క్యాపిటల్‌ సాధించగలమని విశ్లేషకులు అంటున్నారు. ఇదే దూకుడు కొనసాగితే సెన్సెక్స్ ఈ ఏడాది చివరకు 61వేల పాయింట్లను దాటొచ్చని ఇప్పటికే కొన్ని సంస్థలు అంచనా వేశాయి. BSE లిస్టెడ్ కంపెనీల మార్కెట్ వాల్యుయేషన్ 2014 నవంబర్ 28 న తొలిసారిగా 100 లక్షల కోట్ల మైలురాయిని దాటింది. తాజాగా ఇది రెట్టింపై 200 లక్షల కోట్లకు చేరింది.

×