Oxford Covid Vaccine, భారత్‌లో క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి కోరిన సీరమ్

  • Published By: naveen ,Published On : July 26, 2020 / 08:18 AM IST
Oxford Covid Vaccine, భారత్‌లో క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి కోరిన సీరమ్

ప్రపంచవ్యాప్తంగా తయారుచేస్తున్న కొవిడ్-19 వ్యాక్సీన్ ప్రయోగాలలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తయారుచేస్తున్న వ్యాక్సీన్ ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. యూకేకి చెందిన ప్రముఖ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, స్వీడిష్ డ్రగ్ మేకర్ ఆస్ట్రాజెనెకాతో (AstraZeneca) కలిసి వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైంది. కాగా, ఆక్స్‌ఫర్డ్‌ అభివృద్ధి చేస్తున్న కొవిడ్‌-19 టీకాకు (వ్యాక్సిన్‌) భారత్‌లో రెండో, మూడో హ్యుమన్ దశ క్లినికల్‌ ట్రయల్స్‌ జరిపేందుకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతిని పుణెకి చెందిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కోరింది. ఆగస్టులో భారత్ లో ట్రయల్స్ చేయాలని సీరమ్ భావిస్తోంది.

‘కొవిషీల్డ్‌’ హ్యుమన్ ట్రయల్స్‌ నిమిత్తం డీసీజీఐకి సీరమ్‌ దరఖాస్తు:
‘కొవిషీల్డ్‌’ ట్రయల్స్‌ నిమిత్తం డీసీజీఐకి సీరమ్‌ దరఖాస్తు సమర్పించిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కొవిషీల్డ్‌ టీకాతో ఆరోగ్యవంతులైన పెద్దవారిలో రోగ నిరోధక వ్యవస్థ ప్రతిస్పందనలు ఎలా ఉన్నాయి? ఎంత వరకు ఇది సురక్షితం? అనే దానిని ర్యాండమ్‌ పద్ధతిలో అధ్యయనం చేయాల్సి ఉందని ఆ దరఖాస్తులో సీరమ్‌ కోరినట్లు ఆ వర్గాలు తెలిపాయి. 18 ఏళ్లకు పైగా వయస్సున్న సుమారు 1600 మంది వాలంటీర్లపై ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

వ్యాక్సిన్ రేసులో ముందున్న ఆక్స్ ఫర్డ్:
ప్రపంచమంతా కరోనా దెబ్బకు విలవిల్లాడిపోతోంది. రోజురోజుకి కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రపంచంలో కరోనాకు భయపడని దేశం లేదంటే అతిశయోక్తి కాదు. ఈ మహమ్మారి అంతుచూసే మందు ఇంకా రాకపోవడంతో అంతా వ్యాక్సిన్ పైనే ఆశలు పెట్టుకున్నారు. వ్యాక్సిన్ తయారీలో ముందున్న ఆక్స్ ఫర్డ్, పేజ్1 క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని ప్రకటించింది. ఆక్స్ ఫర్డ్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ ను భారత్ లో తయారు చేసేందుకు పుణెకు చెందిన సీరం ఇన్ స్టిట్యూట్ ఆస్ట్రాజెనెకాతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

నవంబర్ నాటికి వ్యాక్సిన్ రెడీ:
ట్రయల్స్ ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని, నవంబర్ నాటికి వాక్సిన్ సిద్ధమవ్వొచ్చని సీరం అధినేత అదర్ పూనావాలా ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ ని అందరికి అందుబాటు ధరలో ఉంచేందుకు ఆలోచించి 1000 రూపాయలుగా ధర నిర్ణయించినట్టు తెలిపారు పూనావాలా. ఆగస్టు నాటికి అన్ని చర్యలు చేపడుతూనే 5వేల మందిపై మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైన్నట్టు తెలిపారు.

వ్యాక్సిన్ రేసులో భారత్ బయోటెక్:
ప్రస్తుతానికి అన్ని క్లినికల్ ట్రయల్స్ లో కూడా ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని పూనావాలా చెప్పారు. ఆక్స్ ఫర్డ్ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ను ఒక బిలియన్(100 కోట్లు) డోసుల తయారు చేసి సరఫరా చేసేందుకు భారత్ కు చెందిన సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఒప్పందం చేసుకుంది. కాగా, కరోనా వ్యాక్సిన్ తయారీలో ఆక్స్ ఫర్డ్ తో పాటు మన హైదరాబాద్ కి చెందిన భారత్ బయోటెక్ సైతం ఈ వాక్సిన్ రూపకల్పనలో ముందంజలో ఉంది.