మ‌హారాష్ట్ర శాస‌నమండ‌లి ఎన్నిక‌ల్లో బీజేపీకి బిగ్ షాక్

మ‌హారాష్ట్ర శాస‌నమండ‌లి ఎన్నిక‌ల్లో బీజేపీకి బిగ్ షాక్

మ‌హారాష్ట్ర శాస‌నమండ‌లి ఎన్నిక‌ల్లో బీజేపీకి బిగ్ షాక్ త‌గిలింది. మంగళవారం మహారాష్ట్రలో ఆరు సీట్ల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో భారతీయ జనతా పార్టీ కేవ‌లం ఒక్క స్థానంలో మాత్ర‌మే విజయం సాధించింది. అధికార శివ‌సేన‌-ఎన్సీపీ-కాంగ్రెస్ కూట‌మి నాలుగు సీట్ల‌ను కైవ‌సం చేసుకోగా.. ఓ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.



కాగా,కూటమి భాగస్వామ్యుులు నాలుగు స్థానాలు గెలిచినప్పటికీ ఇందులో శివసేన ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు. అమ‌రావ‌తిలో శివ‌సేన ఏకైక అభ్య‌ర్థి ఓట‌మి పాల‌య్యారు. అయితే గ్రాడ్యుయేట్ నియోజ‌క‌వ‌ర్గ‌మైన నాగ‌పూర్‌లో బీజేపీ ఓడిపోవ‌డం దారుణం. గ‌తంలో కేంద్ర మంత్రి గ‌డ్క‌రీ,మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తండ్రి గంగాధర్ రావు ఫడ్నవీస్ ప్రాతినిధ్యం వహించిన నాగ‌పూర్‌లో ఈ సారి బీజేపీ ప‌రాజ‌యం పాలైంది.



పూణేలో దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌, మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్ర‌కాంత్ పాటిల్‌లు తీవ్రస్థాయిలో ప్ర‌చారం చేసినప్పటికీ అక్క‌డ అధికార కూట‌మి అభ్య‌ర్థి విజ‌యం సాధించారు. పూణే మరియు ఔరంగాబాద్ గ్రాడ్యేమేట్ స్థానాల్లో ఎన్సీపీ విజయం సాధించింది. శాసనమండలి ఎన్నికల ఫ‌లితాల‌పై మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ స్పందించారు. అంచ‌నాల‌కు త‌గిన‌ట్లు ఫలితాలు లేవ‌ని ఫ‌డ్నవీస్ అన్నారు. మేం చాలా సీట్లు ఊహించాం, కానీ ఒక్క‌టే గెలిచామ‌న్నారు. మూడు పార్టీల కూటమి పవర్ ని తక్కువగా  ఊహించామని తెలిపారు.



అయితే, ఈ ఎన్నికలను ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడి(MVA)ప్రభుత్వం, ప్రతిపక్ష బీజేపీ చాలా ప్రతిష్ఠాత్మకంగా భావించిన విషయం తెలిసిందే. ఏడాది పాలన పూర్తి చేసుకున్నసిద్దాంత విరుద్ధ పార్టీలైన అధికార కూటమికి ఇది మొదటి టెస్ట్ గా చెప్పవచ్చు. ఈ పరీక్షలో కూటిమి విజయం సాధించింది. మహావికాస్ అఘాడి ప్రభుత్వ పనితీరుకు ఈ ఫలితాలు నిదర్శనమని ఎన్సీనీ చీఫ్ శరద్ పవార్ వ్యాఖ్యానించారు.