అశ్లీల వీడియోలు చూస్తే జైలుకే: నిఘా పెంచిన పోలీసులు

  • Published By: vamsi ,Published On : December 27, 2019 / 03:50 AM IST
అశ్లీల వీడియోలు చూస్తే జైలుకే: నిఘా పెంచిన పోలీసులు

దేశవ్యాప్తంగా అశ్లీల వీడియోలను బ్యాన్ చేసినా కూడా ఇంకా వాటిని చూసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌లో అశ్లీల వీడియోలు చూసేవారిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశాయి రాష్ట్ర ప్రభుత్వాలు. లేటెస్ట్‌గా ఇదే విషయమై తమిళనాడులో చెన్నై పోలీసులు 30 మందిపై కేసులు పెట్టారు. వీరిని అరెస్టు చేయడానికి మహిళా పోలీసు అధికారి జయలక్ష్మి నేతృత్వంలోని బృందం సిద్ధమైంది. 

హైదరాబాద్‌లో దిశా ఘటన తరువాత మహిళలు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులకు అశ్లీల వీడియోల ప్రభావమే ఎక్కువని భావించిన పోలీసులు.. ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లో గడుపుతూ అశ్లీల వీడియోలను చూసేవారిని, వాటిని డౌన్‌లోడ్‌ చేసి షేర్ చేసేవాళ్లపై నిఘా పెట్టారు. ఇందులో భాగంగానే మూడు వేల మందిని గుర్తించిన అక్కడి పోలీసులు వారి వివరాలు తెలుసుకుంటున్నారు. వారికి ఫస్ట్ టైమ్ తప్పు కింద హెచ్చరికలు చేయనున్నారు. పదేపదే తప్పు చేస్తే వారికి ఏడేళ్ల జైలు శిక్ష పడుతుంది. 

ఈ క్రమంలోనే తిరుచ్చికి చెందిన క్రిష్టోఫర్‌ అల్ఫోన్స్‌ రాజా(40) అనే వ్యక్తి ఓ మెసెంజర్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకుని పోర్న్ వీడియోలను ఇష్టానుసారంగా షేర్ చేస్తుండడాన్ని పోలీసులు గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ నేరం కింద అరెస్ట్ అయిన తొలి వ్యక్తి అతడే. ఇక తమిళనాడులో గుర్తించిన 30మందిలో 24 మంది చిరునామాలు తెలుసుకున్నారు. మిగిలిన ఆరుగురు తమిళనాడు అడ్రెస్ ఇచ్చినా కూడా ఉత్తరాధికి చెందినవారిగా తెలిసినట్లు పోలీసులు చెబుతున్నారు. 

ఇక ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా అశ్లీల వీడియోలు చూస్తున్న వ్యక్తులను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అతిగా ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లో గడుపుతూ అశ్లీల వీడియోలను చూసే వారిని, వాటిని డౌన్‌లోడ్‌ చేసే వారిని, షేరింగ్‌ చేసే వారిని గుర్తించిన హైద‌రాబాద్ పోలీస్ యంత్రాంగం అరెస్టుల‌కు సిద్ధ‌మ‌వుతోంది.