షాహి ఈద్గా- కృష్ణ జన్మభూమి వివాదం.. పిటిషన్ కొట్టేసిన మథుర కోర్టు

  • Published By: venkaiahnaidu ,Published On : September 30, 2020 / 09:50 PM IST
షాహి ఈద్గా- కృష్ణ జన్మభూమి వివాదం.. పిటిషన్ కొట్టేసిన మథుర కోర్టు

Shahi Idgah-Krishna Janmasthan Dispute కృష్ణ జన్మభూమిలోని మసీదును తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను మథుర సివిల్ కోర్టు బుధవారం తోసిపుచ్చింది. దీనిపై అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు పిటిషన్‌దారులు నిర్ణయించారు.

శ్రీకృష్ణ జన్మభూమి పక్కనే ఉన్న షాహి ఈద్గా మసీదును తొలగించి మొత్తం భూమిని అప్పగించాలంటూ ‘భగవాన్ శ్రీ కృష్ణ విరాజ్మన్’ తరపున న్యాయవాదులు హరిశంకర్, విష్ణు జైన్ మధుర కోర్టులో ఈ నెల 25 న దావా వేశారు. శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్, షాహి ఈద్గా మేనేజ్‌మెంట్ కమిటీ మధ్య కుదిరిన భూమి ఒప్పందాన్ని ఆమోదిస్తూ 1968లో మధుర కోర్టు ఇచ్చిన రూలింగ్‌ను రద్దు చేయాలని పిటిషనర్లు కోరారు.


మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సేనలు శ్రీకృష్ణుడి జన్మస్థలం అని నమ్ముతున్న స్థలంలోని కొంత భాగాన్ని ధ్వంసం చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆలయం పక్కన ఉన్న ఒక మసీదును తొలగించి తమకు అప్పగించాలని పిటిషన్‌దారులు కోరారు. ఈ భూమి యొక్క ప్రతి అంగుళం శ్రీ కృష్ణుడు, హిందూ సమాజ భక్తులకు పవిత్రమైనదని న్యాయవాది విష్ణు జైన్ తన దావాలో… 13.37 ఎకరాల ‘శ్రీ కృష్ణ జన్మభూమి’ ప్రక్కనే ఉన్న షాహి ఈద్గా మసీదును తొలగించాలని డిమాండ్ చేస్తూ మొత్తం భూమిని శ్రీకృష్ణ మందిరానికి అప్పగించాలని దావాలో కోరారు.


కాగా, ఈ పిటిషన్‌ను విచారణకు అనుమతించకపోవడానికి కారణం ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టం, 1991 ప్రకారం నిషేధం ఉండటమేనని కోర్టు చెప్పింది. ఇదిలావుండగా, ఈ పిటిషన్‌తో తమకు, ట్రస్ట్‌కు ఎటువంటి సంబంధం లేదని శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థ ట్రస్ట్ (శ్రీ కృష్ణ జన్మభూమి న్యాస్) కార్యదర్శి కపిల్ శర్మ తెలిపారు.