Haridwar Kumbh Mela : 35లక్షల మంది స్నానాలు.. కుంభమేళాలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 2వేలకు చేరువలో కొత్త కేసులు

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కరోనా కట్టలు తెంచుకుంటోంది. ఒక్కరోజే 1925 కరోనా కేసులు నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది(2021) నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. అయితే హరిద్వార్ లో కొనసాగుతున్న కుంభమేళాకు లక్షలాది మంది భక్తులు పోటెత్తుతుండటమే కరోనా కేసులు పెరగడానికి కారణం అనే వాదనలు వినిపిస్తున్నాయి.

Haridwar Kumbh Mela : 35లక్షల మంది స్నానాలు.. కుంభమేళాలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 2వేలకు చేరువలో కొత్త కేసులు

Haridwar Kumbh Mela

Haridwar Kumbh Mela : ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కరోనా కట్టలు తెంచుకుంటోంది. ఒక్కరోజే 1925 కరోనా కేసులు నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది(2021) నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. అయితే హరిద్వార్ లో కొనసాగుతున్న కుంభమేళాకు లక్షలాది మంది భక్తులు పోటెత్తుతుండటమే కరోనా కేసులు పెరగడానికి కారణం అనే వాదనలు వినిపిస్తున్నాయి. రెండు రోజులుగా లక్షలాదిగా భక్తులు గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భారీ సంఖ్యలో గుమికూడుతున్న భక్తులు కరోనా నిబంధనలు పాటించడం లేదు. కుంభమేళాలో రోజూ 500 చొప్పున పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సోమవారం 408, మంగళవారం 594 మంది కరోనా బారిన పడ్డారు.

లక్షలాది మంది భక్తులు ఒకేచోట గుమిగూడుతుండటంతో వైరస్ వ్యాపిస్తోంది. హరిద్వార్ మహాకుంభమేళాలో వైశాఖి పర్వదినానికి సంబంధించి ఇవాళ(ఏప్రిల్ 14,2021) మూడోరోజు షాహీ స్నానాలు కొనసాగుతున్నాయి. షాహీ స్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తులతో కుంభమేళా కిక్కిరిసిపోయింది. షాహీ స్నానాల్లో 20లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. సోమవారం(ఏప్రిల్ 12,2021) 35లక్షల మంది భక్తులు షాహీ స్నానాల్లో పాల్గొన్నారు. ఇందులో కేవలం 18వేల మందికి టెస్టులు నిర్వహించగా, 102 మందికి పాజిటివ్ వచ్చింది.

చేతులెత్తేసిన ప్రభుత్వం:
కుంభమేళాకు భారీగా యాత్రికులు వస్తున్నప్పటికి కరోనా నిర్ధారణ పరీక్షలు చెయ్యడంలో ప్రభుత్వం విఫలమైంది. భక్తుల రద్దీతో నిబంధనలను గాలికి వదిలేశారు. భక్తులను నియంత్రించలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. అధికారులు మాత్రం ఆర్టీపీసీఆర్ నెగిటివ్ గా వచ్చిన భక్తులకే అనుమతి ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. గ్రౌండ్ స్థాయిలో పరిస్థితి వేరుగా ఉంది. కుంభమేళాతో కరోనా సూపర్ స్ప్రెడ్ గా మారనుందని, రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే హెచ్చరించింది.

కుంభమేళాను మర్కజ్‌తో పోల్చద్దు:
కుంభమేళా విషయంలో సీఎం తీరత్ సింగ్ రావత్ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. కుంభమేళాను ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ తో పోల్చవద్దన్నారు. తబ్లిగి జమాత్ సమావేశాలతో కుంభమేళాకు సంబంధం లేదన్నారు. గతేడాది(2020) కరోనావైరస్ ప్రారంభ సమయంలో తబ్లిగి జమాత్ పేరుతో ముస్లింలు మర్కజ్ భవనంలో నాలుగు గదుల మధ్య సమావేశాలు జరుపుకున్నారు. ఈ సమావేశానికి విదేశాల నుంచి ముస్లింలు హాజరయ్యారని గుర్తు చేశారు. కానీ కుంభమేళా బహిరంగ ప్రదేశంలో జరుగుతోందని అన్నారు. హరిద్వార్ లో 16కు పైగా ఘాట్లు ఉన్నాయన్నారు. కుంభమేళాలో ఇప్పటివరకు విదేశీయులు ఎవరూ పాల్గొనలేదని వివరించారు. కుంభమేళాను మర్కజ్ తో పోల్చలేమన్నారు. గంగమ్మ తల్లి కృపతో వైరస్ వ్యాప్తి చెందడం లేదన్నారు సీఎం రావత్. 12ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళాకు కొవిడ్ ప్రోటోకాల్స్ మధ్య అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.