సాగు చట్టాలపై బ్రిటన్ పార్లమెంట్ చర్చ సరైనదే

సాగు చట్టాలపై బ్రిటన్ పార్లమెంట్ చర్చ సరైనదే

Shashi Tharoor భారత్ లోని నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళన, మీడియా స్వేచ్ఛ అంశాలపై మూడు రోజుల క్రితం బ్రిటన్ పార్లమెంట్‌ లో 90నిమిషాలపాటు చేపట్టిన చర్చ తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వం దీన్ని తీవ్రంగా ఖండించడంతో పాటు..అనవసరమైన చర్చ అంటూ బ్రిటన్ రాయబారికి మంగళవారం సమన్లు ఇచ్చింది. వేరొక ప్రజాస్వామ్య దేశంలోని రాజకీయాల్లో పూర్తిగా జ్యోకం చేసుకోవడంగానే దీన్ని భావిస్తున్నామని భారత్ తేల్చిచెప్పింది. నిజాలు తెలుసుకోకుండా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంపై నిందలు వేయడం బాధించిందని లండన్‌లోని భారత హైకమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది.

అయితే,బ్రిటన్ రాయబారికి భారత్ సమన్లు జారీ చేసిన మరుసటి రోజే ఈ విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ స్పందించారు. బ్రిటన్‌ పార్లమెంట్‌లో జరిగిన చర్చ సరైనదేనని శశిథరూర్ అభిప్రాయపడ్డారు. ఇతర దేశాలకు చెందిన అంతర్గత అంశాన్ని తీసుకొని మనం చర్చించినప్పుడు.. ఇతర దేశాలకు కూడా ఆ హక్కు ఉంటుందని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వ్యక్తులకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉందన్నారు.

బుధవారం శశిథరూర్ మీడియాతో మాట్లాడుతూ..భారత్‌ గతంలో పాలస్తీనా-ఇజ్రాయెల్ అంశంపై చర్చ జరిపింది. ఇతర దేశాలకు చెందిన అంతర్గత అంశాన్ని తీసుకొని మనం చర్చించొచ్చు. బ్రిటిష్ పార్లమెంట్‌కు కూడా అదే హక్కు ఉంటుంది. అయితే భారత ప్రభుత్వ స్పందనను నేను తప్పుపట్టడం లేదు. కానీ, ఈ అంశంలో మరో కోణం ఉందని గుర్తించాలి. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన వ్యక్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంది. దీంట్లో పెద్దగా ఆశ్చర్యపోయేది ఏమీ లేదు. దీన్ని సాధారణ విషయంగా పరిగణించాలి. ప్రజాస్వామ్యాల మధ్య ఇలాంటివి జరుగుతుంటాయని థరూర్ వ్యాఖ్యానించారు.

సోమవారం బ్రిటన్ పార్లమెంట్ లో

భార‌త సంత‌తికి చెందిన లిబ‌ర‌ల్ డెమోక్రాట్ నేత గుర్చ్ సింగ్ వేసిన పిటిష‌న్ ఆధారంగా సోమవారం బ్రిట‌న్ పార్ల‌మెంట్‌లో భారత్ లో రైతుల ఆందోళన,మీడియా స్వేచ్ఛ అంశాలపై 90నిమిషాలపాటు చ‌ర్చ చేప‌ట్టారు. ఆ పిటిష‌న్‌పై బ్రిట‌న్‌లో ఉన్న స్థానికుల నుంచి ల‌క్ష‌ల సంఖ్య‌లో సంత‌కాలు సేక‌రించారు. రైతుల నిర‌స‌న‌ల ప‌ట్ల మోడీ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన తీరును చర్చ సమయంలో లేబర్ పార్టీ,లిబరల్ డెమోక్రాట్స్,స్కాటిష్ నేషనల్ పార్టీ ఎంపీలు ఖండించారు. రైతు సంస్క‌ర‌ణ‌లు భార‌త ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ని, ఆ సంస్క‌ర‌ణ‌ల గురించి తాము చ‌ర్చించ‌డం లేద‌ని, కేవ‌లం నిర‌స‌న‌కారుల ర‌క్ష‌ణ గురించి ,మీడియా స్వేచ్ఛ గురించి మాత్ర‌మే చ‌ర్చిస్తున్నామ‌ని స్కాటిష్ నేష‌న‌ల్ పార్టీ ఎంపీ మార్టిన్ డే బ్రిటన్ పార్లమెంట్ లో మాట్లాడారు. రైతు నిర‌స‌న‌కారుల‌పై టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించార‌ని, ప‌లు చోట్ల ఘ‌ర్ష‌ణ‌లు చోటుచేసుకున్నాయ‌ని, ఇంట‌ర్నెట్ క‌న‌క్టివిటీ దెబ్బ‌తిన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. లేబ‌ర్ పార్టీ నేత జెర్మీ కార్బిన్ మాట్లాడుతూ.. ఎందుకు రైతులు అంత పెద్ద సంఖ్య‌లో నిర‌స‌న‌లు చేప‌డుతున్నారో ఆలోచించాల‌న్నారు. జ‌ర్న‌లిస్టుల అరెస్టు ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ద‌న్నారు. మరోపక్క ఇదే చర్చలో కొంతమంది ఎంపీలు భారత ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారు.