ఆప్ – కాంగ్రెస్ కూటమి ? : కేజ్రీవాల్‌కు షీలా లంచ్ ఆఫర్

  • Published By: madhu ,Published On : May 12, 2019 / 10:17 AM IST
ఆప్ – కాంగ్రెస్ కూటమి ? : కేజ్రీవాల్‌కు షీలా లంచ్ ఆఫర్

ఆమ్‌ ఆద్మీ..కాంగ్రెస్‌తో కూటమిగా ఏర్పాటు కానుందా..కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ సిఎం షీలా దీక్షిత్ మధ్య నడిచిన ట్వీట్ల వరసే ఇందుకు బలం చేకూర్చుతోంది. 6వ దశ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఈ రెండు పార్టీలు ఇక ముఖామఖీ మరోసారి చర్చలకు కూర్చునే అవకాశాలు కన్పిస్తున్నాయ్. ఎన్నికల ఫలితాలకు ముందే ప్రతిపక్ష పార్టీలు సంఘటితం అయ్యే వ్యూహం ఊపందుకున్నట్లు కన్పిస్తోంది. ఏ కూటమికి మెజారిటీ దక్కకపోయినా…బిజెపి కనుక పెద్ద పార్టీగా నిలిస్తే..అధికారానికి దూరంగా ఉంచేందుకు ప్లాన్ రెడీ అయింది. అందుకోసం ఇప్పటికే ప్రతిపక్షపార్టీలు రాష్ట్రపతిని కలిసేందుకు నిర్ణయించుకున్నాయ్.

ప్రణాళికలో భాగంగానే ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్..ఆమ్ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కి స్నేహహస్తం చాపారు. తనపై విమర్శలు చేస్తోన్న కేజ్రీవాల్ తానెంత ఆరోగ్యంగా ఉన్నదీ తెలుసుకునేందుకు లంచ్‌కి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. మోడీ మరోసారి ప్రధాని అయితే అందుకు రాహుల్ గాంధీనే బాధ్యుడంటూ కేజ్రీవాల్ గత వారం హెచ్చరించారు. దీంతో తాను కాంగ్రెస్‌తో కలిసి నడిచేందుకు సిధ్దంగా ఉన్నట్లు సంకేతం పంపారు.

రాహుల్‌కి అన్ని పార్టీలతో కలిసి నడవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. దీంతో అలర్టైన కాంగ్రెస్సే ఇలా షీలాదీక్షిత్ ద్వారా ఈ ట్వీట్ రాయబారం పంపినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో షీలాదీక్షిత్ చురుకుగా లేరంటూ కేజ్రీవాల్ విమర్శించారు. షీలాదీక్షిత్ ట్వీట్‌పై స్పందించిన కేజ్రీవాల్ తానెప్పుడూ ఆమెని చులకన చేయలేదన్నారు. పెద్దలని గౌరవించడమే తన కుటుంబం నేర్పిందని..లంచ్‌కి ఎప్పుడు రావాలో చెప్పాలంటూ రిప్లై ఇచ్చారు.

తాజా పరిణామాలతో ఇక ఆమ్‌ఆద్మీ, కాంగ్రెస్, ఫలితాలకు ముందే కూటమిగా ఉన్నట్లు ప్రకటించవచ్చనే సంకేతాలు వస్తున్నాయ్. లోక్ సభ ఎన్నికల్లో పొత్తు కోసం కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రయత్నించాయి. సీట్ల సర్దుబాటు విషయంలో రెండు పార్టీలకూ సఖ్యత కుదరలేదు. లేటెస్ట్ డెవలప్‌మెంట్స్ చూస్తుంటే మాత్రం ఎన్నికల అనంతరం పొత్తు దాదాపు ఖరారైనట్లే.