కధ కంచికి : ముగిసిన షిర్డీ వివాదం

  • Published By: chvmurthy ,Published On : January 20, 2020 / 03:09 PM IST
కధ కంచికి : ముగిసిన షిర్డీ వివాదం

షిర్డీ సాయిబాబా జన్మస్ధలంపై తలెత్తిన వివాదం సద్దు ముణిగింది.  ఈ అంశంపై శివసేన వెనక్కితగ్గింది. ఇకముందు బాబా జన్మస్ధలంగా పత్రిని పేర్కోనేది లేదని, కొత్త వివాదం సృష్టించే ఉద్దేశ్యం తమకు లేదని… ఇక వివాదం ముగిసినట్టేనని ఆ పార్టీ నేత  కమలాకర్ కోతే తెలిపారు. షిర్డీ సాయిబాబా జన్మస్థలంగా పత్రిని ఇక ముందు పేర్కొనరాదని సమావేశం నిర్ణయించినట్టు చెప్పారు. సాయిబాబా జన్మస్థలమైన పత్రి గ్రామాన్ని రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తామని శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఇటీవల ప్రకటించడంతో వివాదానికి దారితీసింది.

బాబా జన్మస్థలంగా పత్రిని ప్రకటించి, అభివృద్ధి చేస్తే షిర్డీ ప్రాశస్త్యం తగ్గిపోతుందని షిర్డీ గ్రామ ప్రజలతో పాటు, పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. షిర్డీ నిరవధిక బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. శివసేనకు చెందిన స్థానిక (షిర్డీ) నేతలు కూడా కూడా షిర్డీవాసుల బంద్‌కు మద్దతు తెలిపారు. బీజేపీకి చెందిన ఎంపీ సుజయ్ విఖే పాటిల్ మరియు ఇతర స్ధానిక నాయకులు కూడా మద్దతు తెలిపారు. కాగా బంద్ విరమించుకోవాలని శివసేన- నేషనలిస్టు  కాంగ్రెస్ పార్టీ-  కాంగ్రెస్ నాయకులు షిర్డీ ప్రజలను కోరారు.

మొదట తాము షిర్డీ భక్తులమని, ఆ తర్వాతే చట్టసభలకు ఎన్నికయ్యామని వారిని శాంతింప చేసే ప్రయత్నాలు చేశారు. అయితే పత్రిని బాబా జన్మస్థలంగా ప్రకటిస్తూ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం వెనక్కి తీసుకోనుంత వరకూ తాము వెనక్కి తగ్గేదిలేదని షిర్డీవాసుల స్పష్టం చేశారు. పత్రి అభివృధ్ధికి నిధులు మంజూరు చేస్తే షిర్డి ప్రజలకు ఎటువంటి అభ్యంతరాలు లేవని…సాయిబాబ జన్మస్ధలం  విషయంలోనే  అనే బీజేపీ నాయకుడు రాధాకృష్ణ విఖే పాటిల్ విలేకరులకు తెలిపారు.

షిర్డీ  ప్రజలు బంద్ పాటించినప్పటికీ షిర్డి సాయిబాబా ఆలయం యధావిధిగా పని చేసింది. ఆలయంలో పూజలు అన్నీ జరిగాయని…యాత్రికులకు ఆహారం, ప్రసాదం అందచేశామని, ఆస్పత్రులు అన్నీ యధావిధిగా పనిచేశాయని, భక్తులు దర్శనం చేసుకున్నారని శ్రీసాయిబాబా సంస్ధాన్ ట్రస్ట్ తెలిపింది.  దీంతో సీఎం ఉధ్దవ్ ఠాక్రే  షిర్డి సంస్ధాన్ కు చెందిన 40 మంది ప్రతినిధులతో సోమవారం సమావేశం నిర్వహించి వివాదానికి తెరదించటంతో పరిస్థితి సద్దు మణిగింది.