non-BJP alliance : కమలం పార్టీకి చెక్ పెట్టేందుకు బీజేపీయేతర కూటమి ఏర్పడనుందా?

దేశ రాజకీయాలు కొత్త రూపు సంతరించుకుంటుందా? ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లిందంటున్న బీజేపీకి చెక్‌ పెట్టేందుకు బీజేపీయేతర కూటమి త్వరలో ఏర్పడనుందా?

non-BJP alliance : కమలం పార్టీకి చెక్ పెట్టేందుకు బీజేపీయేతర కూటమి ఏర్పడనుందా?

Mamata Benerjee

Should a non-BJP alliance be formed in india? : దేశ రాజకీయాలు కొత్త రూపు సంతరించుకుంటుందా? ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లిందంటున్న బీజేపీకి చెక్‌ పెట్టేందుకు బీజేపీయేతర కూటమి త్వరలో ఏర్పడనుందా? దేశంలోని ముఖ్యనేతలకు లేఖ రాయడం వెనక దీదీ వ్యూహమేంటి? పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ, టీఎంసీ పార్టీలు పోటాపోటీ ప్రచారాలతో హీట్ పెంచాయి. ఇరు పార్టీల నేతలు పరస్పర దాడులు, ప్రతిదాడులతో బెంగాల్ రణరంగాన్ని తలపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీయేతర పార్టీలకు లేఖ రాయడం హాట్‌టాపిక్‌గా మారింది. సోనియా గాంధీతో సహా బీజేపీయేతర పార్టీల నేతలకు కీలక విజ్ఞప్తి చేశారామె. భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని.. ఆ పార్టీకి వ్యతిరేకంగా మనమంతా ఏకమవ్వాల్సిన సమయం వచ్చిందని లేఖలో తెలిపారు. బీజేపీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సి వ్యూహంపై చర్చించేందుకు భేటీ అవుదామని మమతా బెనర్జీ ప్రతిపాదించారు.

ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆమ్ ఆద్మీ పార్టీ.. 2014, 19 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని రెండుసార్లు ఓడించిందన్నారు మమత. ప్రజా తీర్పుపై నమ్మకం లేక లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌కు అధికారాలను కట్టబెట్టడం కోసం బీజేపీ కొత్త చట్టం తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారామె. నేషనల్ కేపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ చట్టం ప్రజాస్వామ్యం, సమాఖ్యపై దాడిగా వర్ణిస్తూ… ఢిల్లీ ప్రజల అధికారాలను హరించడమేనన్నారు దీదీ. రాజ్యాంగ విధానాలు, నైతికతకు బీజేపీ వ్యతిరేకమని ఇది ఢిల్లీకే పరిమితం కాదని.. అలాగే వదిలేస్తే దేశానికే ప్రమాదమని మమత హెచ్చించారు. పశ్చిమ బెంగాల్‌ సహా బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బందులు పెడుతోందన్నారు. గవర్నర్‌ వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని, రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్‌ నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా బీజేపీ కార్యకర్తగా పనిచేస్తున్నారని దీదీ మండిపడ్డారు.

కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలను బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్నారు. విపక్షాల నేతలను రాజకీయంగా సమాధి చేసేందుకు కేంద్ర సంస్థలను వినియోగిస్తోందన్నారు. బెంగాల్‌, తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే మోడీ ప్రభుత్వం అక్కడి ప్రతిపక్ష పార్టీలైన డీఎంకే, తృణమూల్‌ నేతలపై ఈడీ దాడులు జరిపించిందన్నారు. కేవలం బీజేపీ యేతర పార్టీలనే లక్ష్యంగా చేసుకుందన్నారు. బీజేపీ నేతలపై ఎక్కడా దాడులు జరగడం లేదని దీదీ తెలిపారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నుంచి నిధులు విడుదల చేయడంలో పక్షపాతం చూపుతోందన్నారు. దీంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడుతున్నాయన్నారు.

ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి కేంద్రం నీతి ఆయోగ్‌ను తీసుకొచ్చిందన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి. నేషనల్‌ డెవలప్‌ మెంట్‌ కమిషన్, ఇంటర్‌ స్టేట్‌ కౌన్సిల్, ప్లానింగ్‌ కమిషన్‌లను రద్దు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వాలు తమ హక్కుల గురించి డిమాండ్‌ చేసే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రయివేటీకరణకు పెద్దపీట వేస్తోందని ఫైరయ్యారు మమత. కేంద్రం తీసుకున్న ప్రయివేటీకరణ నిర్ణయం ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే తప్ప మరోటి కాదన్నారు. అవన్నీ దేశ ప్రజల ఆస్తులేనని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితులలో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకంకావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు మమతా బెనర్జీ. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఈ పోరాటంలో మనస్ఫూర్తిగా కలిసి పనిచేయాలనుకుంటున్నట్టు దీదీ తన లేఖలో తెలిపారు.