5 రాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు

5 రాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు

Simultaneous Assembly elections in 5 states : దేశంలో లోక్‌సభ ఎన్నికల తర్వాత… మళ్లీ ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వాటిని ఎలా జరపాలి, ఏం చెయ్యాలి అనేది మాట్లాడేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ సమావేశం కాబోతోంది. ఇవాళ షెడ్యూల్ ఫైనల్ చేసి… త్వరలో ప్రకటించి… ఆ తర్వాత ఎన్నికలు జరిపిస్తుంది. ఇందుకోసం ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా రెడీ అవుతున్నారు. ఇవాళ్టి మీటింగ్ చాలా ముఖ్యమైనది.

ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ రాష్ట్రాల్లో ఏ పార్టీ గెలుస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది. పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తుందా… లేక బీజేపీ పాగా వేస్తుందా అనేది సర్వత్రా చర్చ జరుగుతోంది. తమిళనాడులో చిన్నమ్మ ఎంట్రీతో అక్కడి రాజకీయాలు కూడా వేడెక్కాయి. ఇక కేరళలో తిరిగి అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్… LDF మరోసారి విజయం సాధించగలదని ఇప్పటికే ప్రీ పోల్ సర్వే అంచనా వేసింది. అసోం, పుదుచ్చేరిపై కూడా ప్రజల్లో ఆసక్తి రేగుతోంది. మొత్తం 5 చోట్ల ఎన్నికలు జరుగుతాయి.

ఎన్నికల సమయంలో CRPF బలగాల్ని ఎలా మోహరించాలి, సున్నితమైన కేంద్రాలు, అతి సున్నిత కేంద్రాలు, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలు ఏవి అనేది కేంద్ర ఎన్నికల సంఘం నేడు చర్చించనుంది. ఇక కరోనా సమయం కాబట్టి… ఎక్కువ దశల్లో ఎన్నికలు జరపాలనుకుంటున్నట్లు తెలిసింది. కీలకమైన బెంగాల్‌లో 7 లేదా 8 దశలు ఉండేలా ఎన్నికల సంఘం ప్రణాళిక రూపొందిస్తోంది. 2016లో 6 దశల్లో జరిగాయి. ఈసీ లెక్కల ప్రకారం… బెంగాల్‌లో 6 వేల 400 పోలింగ్ కేంద్రాలు సున్నితమైనవి. మిగతా రాష్ట్రాలతో పోల్చితే… ఇక్కడే ఎక్కువ. అటు పోలింగ్ కేంద్రాలు కూడా 80 వేల నుంచి లక్ష దాటేశాయి.

పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 294 అసెంబ్లీ స్థానాలుండగా… తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలున్నాయి. కేరళ అసెంబ్లీకి 140, అసోమ్ అసెంబ్లీకి 126 స్థానాలతో పాటు పుదుచ్ఛేరి అసెంబ్లీలోని 30 స్థానాలకు కూడా ఈ దఫా ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీజేపీ మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్‌ ఎన్నికలు ఈసీకి పెద్ద సవాల్‌ కానున్నాయి.