ఓ వైపు రామాలయ నిర్మాణం…మరోవైపు సీతామాతల దహనం

  • Published By: venkaiahnaidu ,Published On : December 6, 2019 / 11:28 AM IST
ఓ వైపు రామాలయ నిర్మాణం…మరోవైపు సీతామాతల దహనం

కాంగ్రెస్ లోక్ సభ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ఇవాళ(డిసెంబర్-6,2019)లోక్ సభలో దేశంలో జ‌రుగుతున్న అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయన వ్యాఖ్యలతో లోక్ సభ దద్దరిల్లింది.

ఒక‌వైపు రామాల‌యాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతుంటే, మ‌రో వైపు సీతామాత‌ల‌ను ద‌హ‌నం చేస్తున్నార‌ని  అధిర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్, ఉన్నావ్‌లో రేప్‌లు జ‌రుగుతున్నాయ‌ని, అక్క‌డి ప్ర‌జ‌లు ఎక్క‌డికి వెళ్లాల‌ని ప్ర‌శ్నించారు. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్‌లో గురువారం  అత్యాచార బాధితురాలిని ద‌హ‌నం చేసిన ఘ‌ట‌న‌ను ఆయ‌న ఈ సందర్భంగా ప్ర‌స్తావించారు. ఆమె 95 శాతం మంట‌ల్లో కాలిపోయింద‌ని, ఈ దేశంలో ఏం జ‌రుగుతోంద‌ని ఆయ‌న ప్రశ్నించారు. చట్టం లేని ప్రాంతంగా ఉత్తరప్రదేశ్ మారిపోయిందన్నారు.

ఉత్తరప్రదేశ్ ను ఉత్తమప్రదేశ్ గా మార్చాలని మాటలు వినిపిస్తున్న సమయంలో అది అధర్మప్రదేశ్ గా మారిందని ఆయన అన్నారు. చట్టం లేని ప్రాంతంగా ఉత్తరప్రదేశ్ మారిపోయిందన్నారు. మరోవైపు ప్రతిపక్షం వ్యాఖ్యలపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ఫైర్ అయ్యారు. హైదరాబాద్, ఉన్నావ్‌ ఘటనలు అత్యంత బాధాకరమని, ఈ ఇష్యూని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు. ఉన్నావ్ ఘ‌ట‌న‌కు నిర‌స‌న‌గా కాంగ్రెస్ స‌భ నుంచి వాకౌట్ చేసింది.