పాంగాంగ్‌లో చైనా సైన్యం మోహరింపు.. యుద్ధ విమానాలతో భారత్ రెడీ

  • Published By: sreehari ,Published On : September 9, 2020 / 06:03 PM IST
పాంగాంగ్‌లో చైనా సైన్యం మోహరింపు.. యుద్ధ విమానాలతో భారత్ రెడీ

భారత్-చైనా సరిహద్దుల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇరుదేశాల సరిహద్దుల్లో పాంగాంగ్ సరస్సు సమీపంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు సైనిక కమాండర్ల స్థాయిలో సంప్రదింపులు జరుగుతుండగా.. మరోవైపు డ్రాగన్‌ భారత్‌ను దొంగదెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తోంది.

డ్రాగన్ ఎత్తులను చిత్తు చేసేందుకు భారత సైన్యం యుద్ధ విమానాలతో  అప్రమత్తమైంది. చైనా కదలికలను ముందుగానే పసిగట్టి దీటుగా ఎదుర్కొనేందుకు సన్నద్ధ మవుతోంది.. అలాగే సాధనా సంపత్తితో భారత్ రెడీగా ఉంది.. పాంగాంగ్‌ ప్రాంతంలో పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) పెద్దసంఖ్యలో దళాలను మోహరించింది.



చైనా తమ సైనిక దళాలను భారీగా మోహరించడమే కాకుండా పాంగాంగ్ ప్రాంతానికి ఆయుధ సామాగ్రితోపాటు పలు మెటీరియల్స్‌ను తరలిస్తోంది. డ్రాగన్‌ దూకుడు చర్యతో భారత సైన్యం స్ధావరాల్లో బలగాలను పెంచుతోంది.. సుఖోయ్‌-30, MIGలతో సహా పలు యుద్ధ విమానాలతో రెడీగా ఉందని  తెలిసింది.

ఆగస్ట్‌ 29 రాత్రి చైనా దళాలు ఈ ప్రాంతంలోకి చొరబడి పాంగాంగ్‌ సరస్సు వద్దకు దూసుకొచ్చాయి.. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం.. డ్రాగన్ చొరబాటు యత్నాలను ధీటుగా తిప్పికొట్టింది.. ఈ క్రమంలో పాంగాంగ్ సరిహద్దులో ఉద్రిక్తతలకు దారితీసింది.



చైనా దూకుడు ధోరణితో భారత సైన్యం పాంగాంగ్‌ ప్రాంతంలోని వ్యూహాత్మక ప్రాంతాల్లో అప్రమత్తమైంది. చైనా కుయుక్తులను తిప్పికొట్టేందుకు ఆయా ప్రాంతాల్లో భారత సైన్యం అదనపు దళాలను మోహరించింది. ఈనెల ఏడో తేదీన తూర్పు లడఖ్‌లో పీఎల్‌ఏ దళాలు భారత భూభాగం వైపు చొచ్చుకువచ్చి గాలిలోకి కాల్పులు జరిపాయి.

వెంటనే భారత్‌ దీటుగా బదులివ్వడంతో చైనా తోకముడిచింది. సరిహద్దుల్లో శాంతి వాతావరణం నెలకొనేలా చూడాలని ఇరుదేశాల రక్షణ శాఖల మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, జనరల్‌ వీ ఫెంగ్‌ నిర్ణయించిన మూడు రోజులకే డ్రాగన్ కాల్పులకు తెగబడింది..