అయోధ్య తీర్పుపై సుప్రీంలో 6 రివ్యూ పిటీషన్లు

  • Published By: chvmurthy ,Published On : December 7, 2019 / 03:56 AM IST
అయోధ్య తీర్పుపై సుప్రీంలో 6 రివ్యూ పిటీషన్లు

అయోధ్యలోని రామజన్మ భూమి వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పుపై సమీక్ష కోరుతూ శుక్రవారం 6 పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీం తీర్పును సమీక్షించాలంటూ ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) తరఫున ఆరుగురు వేర్వేరుగా తమ లాయర్‌ ఎంఆర్‌ శంషాద్‌ ద్వారా శుక్రవారం, డిసెంబర్6న ఈ ఆరు పిటిషన్లు వేశారు. 

కాగా, అయోధ్యలో శుక్రవారం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు యథావిధిగా పనిచేశాయి. మసీదుల్లో ప్రార్థనలు, ఆలయాల్లో పూజలు ప్రశాంతంగా జరిగాయి. బాబ్రీ మసీదు విధ్వంసాన్ని పురస్కరించుకుని ముస్లిం సంస్థలు ఏటా డిసెంబర్‌ 6వ తేదీని బ్లాక్‌ డేగా వ్యవహరిస్తూండగా, హిందువులు శౌర్యదినంగా పాటిస్తున్న విషయం తెలిసిందే.

అయోధ్య రామజన్మ భూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీం కోర్టు 2019, నవంబర్ 9న చారిత్రక, సంచలనమైన తీర్పు వెలువరించింది. వివాదంలో ఉన్న అయోధ్య స్థలం తమదేనంటూ ముస్లిం సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసిన సుప్రీం కోర్టు.. ఆ స్థలంలో రామ మందిరం నిర్మించాలని తేల్చి చెప్పింది. వివాదాస్పద స్థలంలో రామమందిరం నిర్మాణం కోసం మూడు నెలల్లో ఓ ట్రస్టును ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది.

అయితే, అదే సమయంలో దశాబ్దాల తరబడిగా కొనసాగుతున్న ఈ కేసులో ముస్లిం సంస్థల పిటిషన్లను కొట్టేసిన కోర్టు.. వారికి ప్రత్యామ్నాయంగా అయోధ్యలోనే మరోచోట 5 ఎకరాల భూమి కేటాయించాలని ఆదేశించింది. అయోధ్య స్థలాన్ని మూడు ముక్కలు చేయాలన్న అలహాబాద్ హై కోర్టు తీర్పును తప్పుపట్టిన సుప్రీం కోర్టు.. ఆ స్థలాన్ని విభజించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది.