ప్రాణం తీసిన స్లీప్ వాక్, 4వ అంతస్తు నుంచి పడి మృతి

ప్రాణం తీసిన స్లీప్ వాక్, 4వ అంతస్తు నుంచి పడి మృతి

sleepwalking man plunges to death: కొందరికి నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాంటి అలవాటు కొన్నిసార్లు అనర్థాలకు దారితీస్తోంది. ప్రాణాలు తీస్తోంది. తాజాగా, స్లీప్ వాక్ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబైలోని కలినా ప్రాంతంలో నివాసం ఉండే వజ్రాల కార్మికుడికి అర్థరాత్రి స్లీప్ వాక్ చేయడం అలవాటు. ఇదే అతడి పాలిట మృత్యువైంది.

బుధవారం(ఫిబ్రవరి 17,2021) తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నిద్రలో నడుస్తూ తన ప్లాట్ లో అటూ ఇటూ తిరిగాడు. ఈ క్రమంలోనే తన ప్లాట్ కిటికీ తెరిచాడు. ప్రమాదవ శాత్తు అక్కడి నుంచి కిందపడ్డాడు. నాల్గవ అంతస్తు నుంచి కిండపటంతో అతడు చనిపోయాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో అసలు విషయం వెలుగుచూసింది. స్లీప్ వాక్ కారణంగానే అతడు చనిపోయాడని పోలీసులు నిర్ధారించారు.

మృతుడి వయసు 25ఏళ్లు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని వజ్రాల వ్యాపారి దగ్గర కార్మికుడిగా పని చేస్తున్నాడు. ముంబైలోని కలినా ప్రాంతంలో హైరైజ్ బిల్డింగ్ లో మరో ముగ్గురితో కలిసి నివాసం ఉంటున్నాడు. కాగా, అతడికి నిద్రలో నడిచే అలవాటు ఉంది. బుధవారం తెల్లవారుజామున 3గంటల సమయంలో నిద్రలో నడుస్తూ వెళ్లాడు. ఆ సమయంలో మిగతావారు గాఢ నిద్రలో ఉన్నారు. ప్లాట్ లో నడుచుకుంటూ వెళ్లిన అతడు కిటికీ తెరిచాడు. దానికి గ్రిల్స్ లేవు. దీంతో అతడు కిటికీలోంచి కిందకు పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ కన్నుమూశాడు.

రంగంలోకి దిగిన వకోలా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. వారి విచారణలో అతడు స్లీప్ వాక్ తో బాధపడుతున్నట్టు గుర్తించారు. నెలలో ఒకసారి లేదా రెండుసార్లు అర్థరాత్రి సమయంలో నిద్రలో లేచి ప్లాట్ లో నడిచేవాడని గుర్తించారు. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున ఘోరం జరిగిపోయిందన్నారు. ఆ సమయంలో ప్లాట్ లో ఉన్న మిగతా వారు గాఢ నిద్రలో ఉన్నారని, ఎప్పుడైతే కిటీకికున్న కర్టన్ వారి మీద పడిందో, అప్పుడు వారికి మెలకువ వచ్చిందని పోలీసులు తెలిపారు. కిటీకి తెరిచి ఉండేసరికి వారి కంగారుపడ్డారు. కిటికీలోంచి కిందకు తొంగి చూసి షాక్ తిన్నారు. తమ రూమ్ మేట్ కిందపడి ఉండటాన్ని గమనించారు. యాక్సిడెంటల్ డెత్ గా కేసు నమోదు చేశామని, తదుపరి దర్యాఫ్తు కొనసాగుతుందని వకోలా పోలీసులు తెలిపారు.