ధూమపానం చేసేవాళ్ళకి కరోనా హాని ఎక్కువే…ఆరోగ్యశాఖ హెచ్చరిక

  • Published By: venkaiahnaidu ,Published On : July 30, 2020 / 02:47 PM IST
ధూమపానం చేసేవాళ్ళకి కరోనా హాని ఎక్కువే…ఆరోగ్యశాఖ హెచ్చరిక

కరోనా వైరస్ కు సంబంధించి వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు ప్రజల్లో ఆందోళనను మరింత పెంచుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పొగ తాగే వారికి షాక్ ఇచ్చింది. ధూమపానం అలవాటు ఉన్నవారికి కరోనా హాని ఎక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది.

పొగత్రాగే సమయంలో చేతి వేళ్లు పెదాలకు తాకుతాయని, చేతిపై ఒకవేళ కరోనా వైరస్ ఉంటే అది సరాసరి నోటిలోకి వెళుతుందని.. తద్వారా కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉందని బుధవారం కేంద్ర వైద్యఆరోగ్య శాఖ హెచ్చరించింది.

ధూమపానం అలవాటు ఉన్నవారికి అప్పటికే కొంత మేర ఊపిరితిత్తులు దెబ్బతిని ఉంటాయని, అలాంటి వాళ్లకు కరోనా సోకితే ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని,తీవ్ర లక్షణాలు కనిపించడంతో పాటు మరణించే అవకాశాలు కూడా వీరికి ఎక్కువని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది.


పొగ తాగేవారిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గడంతో కరోనా సులభంగా వ్యాపిస్తుందని, ఇప్పటికైనా పొగతాగే అలవాటును మానుకోండని వైద్యులు సూచిస్తున్నారు. కాగా, గతంలో చైనా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో పొగ తాగే వాళ్లకు కరోనా సోకే అవకాశాలు 14 రెట్లు ఎక్కువగా ఉంటాయని తేలింది. చైనాలో కరోనా సోకిన వేలాది మందిపై పరిశోధనలు చేసి.. అక్కడ వెలువడే హెల్త్‌ జనరల్‌లో ఈ విషయాన్ని ప్రచురించారు. మరోవైపు, భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 15 లక్షలు దాటింది. రోజువారీ కేసుల సంఖ్య 50,000 కి దగ్గరగా పెరిగింది.