సోషల్ స్వేచ్ఛకు అడ్డుకట్ట…కొత్త రూల్స్ లోని ముఖ్యమైన విషయాలివే

సోషల్ స్వేచ్ఛకు అడ్డుకట్ట…కొత్త రూల్స్ లోని ముఖ్యమైన విషయాలివే

Social media సోషల్‌ మీడియాలో హద్దులు మీరిన స్వేచ్ఛకు నిబంధనల పేరిట కేంద్రం అడ్డుకట్ట వేసింది. సోషల్ మీడియాలో,డిజిటల్ మీడియా వస్తోన్న కంటెంట్‌ను,ఓటీటీ ప్లాట్‌ఫాంలను నియంత్రించే వ్యూహంలో భాగంగా కొత్త మార్గదర్శకాలను గురువారం ప్రకటించింది.

టెక్ కంపెనీల‌పై ఆధిప‌త్యం కోసం కేంద్ర ప్ర‌భుత్వం కొత్త డిజిట‌ల్ ముసాయిదాను త‌యారు చేసింది. దీనికి సంబంధించిన ఇవాళ కేంద్ర ఐటీశాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ కొన్ని విష‌యాల‌ను వెల్ల‌డించారు. సోష‌ల్ మీడియా దుర్వినియోగంపై విస్తృత స్థాయిలో చ‌ర్చించామ‌ని ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ తెలిపారు. డిజిట‌ల్ కంటెంట్ విష‌యంలో 2018 డిసెంబ‌ర్‌లో ముసాయిదా త‌యారు చేశామ‌ని, దీంట్లో రెండు క్యాట‌గిరీలు ఉంటాయ‌న్నారు. అనుచిత వ్యాఖ్య‌లు చేస్తూ ట్వీట్ లేదా సందేశం పోస్టు చేసిన వారి తొలి వ్య‌క్తి స‌మాచారాన్ని కోర్టు ఆదేశం లేదా ప్ర‌భుత్వ ఆదేశం ప్ర‌కారం సోష‌ల్ మీడియా సంస్థ‌లు బ‌హిర్గతం చేయాల‌ని తెలిపారు. దేశ సార్వ‌భౌమ‌త్వం, స‌మ‌గ్ర‌త‌, భ‌ద్ర‌త‌, శాంతిభ‌ద్ర‌త‌లు, విదేశీ వ్య‌వ‌హారాలు, అత్యాచారం, అస‌భ్య కాంటెంట్‌ను ప్ర‌చారం చేసేవారి విష‌యంలోనే ఈ చ‌ర్య‌లు వ‌ర్తిస్తాయ‌ని మంత్రి వెల్ల‌డించారు.

24 గంట‌ల్లో తొల‌గించాలి

సోష‌ల్ మీడియా దుర్వినియోగంపై ఫిర్యాదు ప‌రిష్కార వ్య‌వ‌స్థ‌ను కూడా రూపొందిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. గ్రీవియ‌న్స్ ఆఫీస‌ర్ స‌దురు స‌మ‌స్య‌ను 24 గంట‌ల్లో రిజిస్ట‌ర్ చేసి.. 15 రోజుల్లో ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తార‌ని మంత్రి ర‌విశంక‌ర్ చెప్పారు. మ‌హిళ‌ల గౌర‌వానికి సంబంధించిన అంశంలో ఎటువంటి అస‌భ్య‌క‌ర‌మైన ఫోటోల‌ను వాడ‌రాదు. ఆడ‌వారిని త‌ప్పుగా చిత్రీక‌రిస్తూ ఏవైనా ఫోటోల‌ను అప్‌లోడ్ చేస్తే.. వారు ఫిర్యాదు చేసిన 24 గంట‌ల్లోనే ఆ ఫోటోల‌ను, సందేశాల‌ను తొల‌గించాల‌ని మంత్రి తెలిపారు. మ‌హిళ‌ల ప‌ట్ల గౌర‌వం వ‌ల్ల ఈ నియ‌మాన్ని తీర్చిదిద్దినట్లు మంత్రి తెలిపారు.

ఓటీటీపై నిఘా

ఓటీటీ ఫ్లాట్‌పామ్‌ల‌కు సంబంధించి మూడు విధానాల‌ను అవ‌లంబించ‌నున్న‌ట్లు కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ తెలిపారు. ఓటీటీతో పాటు డిజిట‌ల్ న్యూస్ మీడియా సంస్థ‌లు త‌మ వివ‌రాల‌ను వెల్ల‌డించాల్సి ఉంటుంద‌న్నారు. రిజిస్ట్రేష‌న్ల‌ను త‌ప్ప‌నిస‌రి చేయ‌డం లేద‌ని, కానీ స‌మాచారాన్ని సేక‌రిస్తున్నామ‌ని మంత్రి తెలిపారు. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ల‌తో పాటు డిజిట‌ల్ పోర్ట‌ల్స్ కోసం ఫిర్యాదు ప‌రిష్కార వ్య‌వ‌స్థ ఉండాల‌న్నారు. ఓటీటీల‌కు స్వ‌యం నియంత్రిత వ్య‌వ‌స్థ ఉండాల‌ని, సుప్రీం మాజీ జడ్జి లేదా హైకోర్టు జ‌డ్జి లేదా ప్ర‌ముఖ వ్య‌క్తి ఎవ‌రైనా ఆ బాధ్య‌త‌లు చూసుకోవాల‌న్నారు.

కొన్ని ముఖ్యమైన విషయాలు

సోషల్ మీడియాలో అసత్య ప్రచారం పై నియంత్రణ

అసత్య ప్రచారం ప్రారంభం చేసే తొలి వ్యక్తి వివరాలు ఖచ్చితంగా తెలపాలి

సోషల్ మీడియా ప్లాట్‌ఫాం డేటా, కంటెంట్‌ను వినియోగదారుల ఫిర్యాదులను నిర్ణీత కాలంలో పరిష్కరించాలి.

అభ్యంతరకరమైనది గుర్తించిన తర్వాత పోస్టును 24 గంటల్లో తొలగించాలి. లేకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయి.

ఓటీటీ ప్లాట్‌ఫాంలలో ఇష్టానుసార వీడియోలు పోస్ట్‌ చేయరాదు..సోషల్‌ మీడియాలో కార్యాలయాలు ఏర్పాటు చేయాలి.

నోడల్ ఏజెన్సీ 24 గంటలు పనిచేస్తూ పర్యవేక్షిస్తుంది. ఫిర్యాదులను అమలు చేయడానికి నోడల్ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది.

ఈ నిబంధనలను ప్రచురించిన తేదీ నుండి 3 నెలల్లోపు చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్ (సీసీఓ) ను నియమించాలి. చట్టానికి,నిబంధనలకు సీసీఓ బాధ్యత వహించాలి.

ఓటీటీలో ఐదు అంశాలు బ్లాక్

అసభ్య, అశ్లీల, హింసాత్మక కంటెంట్ పై నిషేధం

వయస్సు ఆధారంగా 5 విభాగాలుగా ఓటీటీ విభజన

సామాజిక ఉద్రిక్తతలు పెంచే లేదా సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే లేదా జాతీయ సమగ్రత, సమైక్యతను దెబ్బతీసే కంటెంట్ పై నిషేధం
మహిళలు, చిన్నారులు, దళితులను అవమానించే కంటెంట్‌పై నిషేధాజ్ఞలు

ఇక, న్యూస్‌ వెబ్‌సైట్లను నియంత్రణ సంస్థ పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రులు రవిశంకర్‌ ప్రసాద్‌, ప్రకాష్‌ జవదేకర్‌ పేర్కొన్నారు. ప్రింట్‌ మీడియా ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా మార్గదర్శకాలను అనుసరిస్తున్న తరహాలోనే న్యూస్‌ వెబ్‌సైట్లు కూడా ఓ నియంత్రణ సంస్థ మార్గదర్శకాలను అనుసరించేలా ఉండాలని ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. డిజిటల్‌ మీడియా నియంత్రణ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనేది ఇంకా నిర్ణయించలేదని, దేశంలో ఎన్ని న్యూస్‌ వెబ్‌సైట్లు ఉన్నాయనేదానిపై నిర్ధిష్ట సమాచారం లేదనిమంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ పేర్కొన్నారు. డిజిటల్‌ న్యూస్‌ మీడియా తమ వివరాలను వెల్లడించాలని, వాటికి రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయలేదని తాము కేవలం సమాచారం కోరుతున్నామని అన్నారు.